చెప్పుతో కొట్టుకున్న వార్డు వ‌లంటీర్!

Update: 2022-06-21 10:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వ ప‌థ‌కాల సంగ‌తి ఏమో కానీ వ‌లంటీర్ల ప‌ని ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన‌ట్టు అవుతోందని చెప్పుకుంటున్నారు. ఏ ప‌థ‌కం రాక‌పోయినా ప్ర‌జ‌లు ముందుగా వ‌లంటీర్ల‌పైనే విరుచుకుప‌డుతున్నారు. దీంతో వలంటీర్లు ఒత్తిడి త‌ట్టుకోలేక‌పోతున్నారు.

రాష్ట్ర స్థాయిలోనే సాంకేతిక కార‌ణాలు, ఇంకా ఇత‌ర కార‌ణాల‌తో ల‌బ్ధిదారుల‌కు ఏ ప‌థ‌కం అయినా అంద‌క‌పోతే వ‌లంటీర్ల‌ను నిందిస్తున్నారు. దీంతో వ‌లంటీర్ల‌కు ప్ర‌జ‌ల చేతిలో తిట్లు త‌ప్ప‌డం లేద‌ని అంటున్నారు.

తాజాగా శ్రీ స‌త్య‌సాయి జిల్లా క‌దిరి మండ‌లం రామ్ దాస్ నాయ‌క్ తండాలో పంట‌ల బీమా రాలేదు ఎందుక‌ని రైతులు నిల‌దీస్తుండ‌టంతో ఆ ఒత్తిడిని త‌ట్టుకోలేని ఓ గ్రామ వ‌లంటీర్ చెప్పుతో త‌న త‌ల‌పై కొట్టుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. వ‌లంటీరుగా చేరినందుకు తనకు ఈ శాస్తి జరగాల్సిందేనని ఆ వ‌లంటీర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

వివ‌రాల్లోకెళ్తే.. శ్రీస‌త్య‌సాయి జిల్లా కదిరి మండలం రామదాస్‌ నాయక్‌ తండాలో నగేష్ నాయక్‌ గ్రామ వ‌లంటీరుగా పనిచేస్తున్నాడు. తన పరిధిలో 50 మంది రైతులతో ఈ-క్రాప్‌ బుకింగ్ చేయించాడు. అయితే వీరిలో ఒకరికి మాత్రమే పంటల బీమా వర్తించింది. మిగిలిన వారికి రాలేదు. దీంతో పంట‌ల బీమా వ‌ర్తించ‌ని రైతులంతా న‌గేష్ నాయ‌క్ పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. నువ్వు స‌రిగా అప్లై చేయ‌లేద‌ని వ‌లంటీరుతో గొడ‌వ‌కు దిగారు. అక్క‌డ వ్య‌వ‌సాయాధికారి, ఇత‌ర సిబ్బంది చూస్తున్నా రైతుల‌ను వారించ‌లేదు.

ఓవైపు న‌గేష్ నాయ‌క్ తాను త‌న ప‌రిధిలోని 50 మందికీ పంట‌ల బీమాను ద‌ర‌ఖాస్తును స‌క్ర‌మంగానే పూర్తి చేశాన‌ని.. ఒక‌రికే ఎందుకు వ‌చ్చిందో త‌న‌కు తెలియ‌ద‌ని చెబుతున్నాడు. పై నుంచి ఉన్న సాంకేతిక స‌మ‌స్య కావ‌చ్చంటున్నాడు.

అయినా ఎంత‌కూ రైతులు విన‌క‌పోవ‌డంతో వ‌లంటీర్ గా ఉన్నందుకు త‌న‌కు ఈ శాస్తి జ‌ర‌గాల్సిందేన‌ని చెప్పు తీసుకుని త‌న‌ను తాను కొట్టుకున్నాడు. ఊళ్లోకి వెళితే తనను రైతులు చెప్పుతో కొట్టేలా ఉన్నారని న‌గేష్ నాయ‌క్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ‌లంటీర్ ఉద్యోగమే తనకు వద్దని.. రాజీనామా చేస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున‌ వైరల్ అవుతోంది.
Tags:    

Similar News