ఇరాన్ అమ్మాయిల దృష్టిలో ఖమేనీ పరిస్థితి ఇది.. డోసు సరిపోదన్న యువరాజు!

ఇరాన్‌ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతోన్న నిరసనలు గంట గంటకూ అన్నట్లుగా తీవ్రరూపం దాల్చుతున్నాయి.;

Update: 2026-01-10 18:30 GMT

ఇరాన్‌ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతోన్న నిరసనలు గంట గంటకూ అన్నట్లుగా తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు సుమారు 300 వరకూ మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఖ్య ఒక్క టెహ్రాన్‌ కే పరిమితమవ్వగా.. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని.. మృతుల్లో ఎక్కువగా యువతే ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ప్రధానంగా ఖమేనీపై యువకుల ఆందోళనలు, యువతుల నిరసనలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పే ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

అవును... గత కొన్ని రోజులుగా ఇరాన్‌ అట్టుడుకుతోంది. ప్రధానంగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతుండటం, కరెన్సీ ఘోరంగా పతనమవ్వడం (రూ.1 = 11,008 ఇరానియన్ రియల్స్)తో ఆ దేశ ప్రజలు.. ప్రధానంగా యువతీయువకులు చేస్తున్న ఆందోళనలు గత రెండు రోజులుగా పీక్స్ కి చేరాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇరానియన్ చట్టాలను ఏమాత్రం లెక్క చేయకుండా.. అక్కడ అమ్మాయిల సిగరెట్లు తాగుతున్నారు. ఆ దేశ సుప్రీం లీడర్ ను ప్రత్యక్షంగా తిరస్కరించకూడదనే నిబంధనను పక్కన పాడేసి.. నేరుగా ఖమేనీ ఫోటోకు నిప్పు పెట్టి, ఆ మంటతోనే సిగరెట్ వెలిగిస్తున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. దీంతో.. ఖమేనీపైనా, ఆ ప్రభుత్వం పైనా ఆ దేశ యువత ఏ స్థాయిలో విసిగిపోయిందో ఈ విషయం స్పష్టంగా చెబుతుందని అంటున్నారు. వాస్తవానికి ఇరానియన్ చట్టాల ప్రకారం.. ఆ దేశ సుప్రీం లీడర్ విగ్రహాన్ని, ఫోటోలను తగలబెట్టడం తీవ్రమైన నేరం! ఇదే సమయంలో మతపరమైన నిబంధన ప్రకారం మహిళలు బహిరంగంగా ధూమపానం చేయడం కుదరదు! అయితే ఇప్పుడు ఉన్న ఆగ్రహావేశాల ముందు.. ఆ చట్టాలు, నిబంధనలను ఆ దేశ అమ్మాయిలు లెక్క చేసే పరిస్థితిలో లేరని తాజా పరిస్థితి చెబుతోంది.

కాగా... 2022లో పోలీసు కస్టడీలో మహ్సా అమినీ మరణం తర్వాత నెలకొన్న పరిస్థితుల ఆధారంగా ఈ నిరసన మొదలై.. ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. పైగా తాజా పరిస్థితుల్లో ఇరాన్ లో ప్రభుత్వ వైఖరిపై ట్రంప్ సైతం జోక్యం చేసుకోవడం, ఇజ్రాయెల్ కు పని అప్పగించే అవకాశాలున్నాయనే చర్చ తెరపైకి రావడంతో మళ్ళీ పశ్చిమాసియాలో ఆకాశం ఎర్రగా, భూమి మండుతూ కనిపించే పరిస్థితులు వచ్చే పరిణామాలను కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు!

స్పందించిన యువరాజు.. కీలక వ్యాఖ్యలు!:

ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి స్పందించారు. సుమారు ఐదు దశాబ్ధాలుగా అమెరికాలో ప్రవాసంలో నివసిస్తున్న పహ్లావీ.. ఇరాన్ ప్రజలకు వీడియో సందేశం పంపారు. తాను కూడా స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తద్వారా మన జాతీయ విప్లవం విజయం సాధించే ఆ గొప్ప సమయంలో.. తాను మీ పక్కన ఉండగలనని అన్నారు. ఇదే సమయంలో.. నిరసనల డోసు మరింత పెంచాలని పహ్లావి ప్రజలకు, ఉద్యోగులకు, కార్మికులకు పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా... ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవాలని.. పబ్లిక్ ప్లేస్ లను స్వాధీనం చేసుకోవాలని.. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేయాలని ఇరానియన్లను కోరారు. కీలక రంగాలలోని కార్మికులు పనిని పక్కనపెట్టి, నిరసనలలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. సాయంత్రం 6 గంటల నుండి ప్రజలు పెద్దేత్తున సిటీల హెడ్ క్వార్టర్స్ వైపు కదలాలని కోరారు. మన పోరాటం వీధుల్లో కాదని.. సిటీ కేపిటల్స్ ను స్వాధీనం చేసుకునే దిశగా కదలాలని కోరారు! ఈ నేపథ్యంలో.. ఇరాన్ లో వాట్ నెక్స్ట్ అనేది సంచలనంగా మారింది!

Tags:    

Similar News