బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య... చెబుతోన్న కారణం ఇదే!
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సునమ్ గంజ్ జిల్లాలోని భంగాడోహోర్ గ్రామంలో ఆర్థిక లావాదేవీల విషయంలో 19ఏళ్ల జై మహాపాత్రోపై ఓ వ్యక్తి ఘోరంగా దాడి చేశాడు.;
దీపూ చంద్రదాస్.. అమృత్ మండల్.. బజేంద్ర బిశ్వాస్.. రాణా ప్రతాప్ బైరాగి.. మోని చక్రవర్తి.. ఇలా బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకుని వరుసగా హత్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తాత్కాలిక ప్రభుత్వం చెప్పుకొస్తున్నా.. మైనారిటీలే లక్ష్యంగా అక్కడ హత్యలు, హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో హిందూ యువకుడిని కొట్టి చంపిన ఘటన తెరపైకి వచ్చింది.
అవును.. బంగ్లాదేశ్ లో హిందూ కుటుంబాలకు సంబంధించిన ఇళ్లకు నిప్పు పెట్టడం.. వారి పెంపుడు జంవుతులను దహనం చేయడ.. హిందూ వ్యక్తులే లక్ష్యంగా దాడులు చేయడం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నట్లుగా మారిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో హిందూ యువకుడిని దారుణంగా కొట్టి, అనంతరం విషమిచ్చి చంపినట్లు స్థానిక మీడియాలో కథనాలొస్తున్నాయి!
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సునమ్ గంజ్ జిల్లాలోని భంగాడోహోర్ గ్రామంలో ఆర్థిక లావాదేవీల విషయంలో 19ఏళ్ల జై మహాపాత్రోపై ఓ వ్యక్తి ఘోరంగా దాడి చేశాడు. అనంతరం గొంతులో విషం పోసినట్లు చెబుతున్నారు! దీంతో.. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మహాపాత్రో మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దాడి చేసిన వ్యక్తిని అమీరుల్ ఇస్లాం గా గుర్తించినట్లు చెబుతున్నారు.
అయితే బంగ్లాదేశ్ లో సాధారణంగా హిందువులపై దాడులు చేయాలంటే.. వారు ఎక్కువగా ఉపయోగించే సాకు లేదా కారణం.. 'ఇస్లాంని అవమానించేలా వ్యాఖ్యానించాడు' అని! అయితే.. తాజాగా మహాపాత్రో విషయంలో మాత్రం ఆర్థిక లావాదేవీలే కారణమంటూ స్థానిక మీడియా నివేదించింది! ఈ సమయంలో.. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి ఈ సంఘటనలపై కీలక నివేదిక విడుదల చేసింది. ఇందులో భాగంగా.. 2025 డిసెంబర్ లో కనీసం 51 హింసాత్మక సంఘటనలు మైనారిటీల లక్ష్యంగా నమోదయ్యాయి.
కాగా... దైవ దూషణ ఆరోపణలతో ఇటీవల దీపూ చంద్రదాస్ అనే హందూ వ్యక్తిపై అల్లరిమూకలు దాడి చేసి, అత్యంత పాశవికంగా హత్య చేసి, మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం.. డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో అమృత్ మండల్ అనే మరో హిందూ వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఇదే సమయంలో.. బజేంద్ర బిశ్వాస్ అనే మరో హిందువుని అతడి సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపాడు.
జెస్సోర్ జిల్లాలో మరో హిందూ వ్యాపారవేత్త రాణా ప్రతాప్ బైరాగి తలపై గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన కొన్ని గంటల తర్వాత నర్సింగ్డిలోని పలాష్ ఉపజిల్లాలోని చార్సింధుర్ బజార్ లో రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు కిరాణా దుకాణం యజమాని మోని చక్రవర్తిని పదునైన ఆయుధంతో కొట్టి హత్య చేశారు.