అయ్యబాబోయ్...అంతా రిచ్...
భారత దేశం ఆర్థికంగా బలహీన పడుతోంది...ఏళ్ళు గడిచినా ఇది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటోంది.;
భారత దేశం ఆర్థికంగా బలహీన పడుతోంది...ఏళ్ళు గడిచినా ఇది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటోంది. అధిక జనాభా, నిరుద్యోగం, పేదరికి, ద్రవ్యోల్బణం దేశ ప్రగతిని కుదేలు చేస్తున్నాయని మనం చెప్పుకుంటున్నా...మరో పక్క దేశంలో ధనవంతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కోటీశ్వరుల క్యూ ఏటా పెరుగుతునే ఉంది. డబ్బులు వెనకేసుకుంటున్న కరోర్ పతులు ఇండియాలో హల్ చల్ చేస్తునే ఉన్నారు. కడపు మండే పేదలే కాదు...కడుపు నిండిన ధనవంతులకు ఇండియాలో కొదవలేదని తెలుస్తోంది. తాజాగా 2025..26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను శాఖకు చేసిన ఈ రిటర్న్స్ పరిశీలిస్తే దిమ్మదిరిగే విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయ్యబాబోయ్ ఇంత రిచ్చా అని ముక్కున వేలేసుకోక తప్పడం లేదు.
ఆదాయ వివరాల వెల్లడిలో కఠినమైన నిబంధనలు, డేటా అనలటిక్స్ వినియోగం, వార్షిక సమాచార నివేదికలు, టీడీఎస్, టీసీఎస్ ట్రాకింగ్ తదితర మార్గాల వల్ల ఆదాయపు పన్ను చెల్లింపుల్లో ఎగవేత ధోరణి తగ్గి పారదర్శకత బాగా పెరిగింది. రూ.50 వేలకు మించి ట్రాన్సాక్షన్ కు పాన్ కార్డు తప్పనిసరి చేయడం వల్ల కూడా ప్రజల ఆదాయ వ్యయాల రికార్డు ప్రభుత్వం వద్ద పక్కాగా ఉంటోంది. నిబంధనలు కఠినంగా అమలవుతోంది అనడానికి తాజా గణాంకాలే నిదర్శనమని అంటున్నారు. ఇన్ కం టాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్ సమాచారం ప్రకారం 2025..26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్...డిసెంబర్ లో దాదాపు 9 కోట్లకు పైగా రిటర్న్ లు దాఖలు అయ్యాయి. అంతకు ముందు 8.92 కోట్లు దాఖలయ్యాయి. సరే గతేడాదితో పోలిస్తే పెంపు స్వల్పమే అయినా...ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి పైగా ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య 3,17,098 నుంచి 3,85,752కు చేరింది. అంటే దాదాపు 21.65 శాతం పెరిగిందన్నమాట. ఇదే సమయంలో రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారి సంఖ్య 24.1 శాతానికి తగ్గింది. అలాగే రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య రెండంకెలకు చేరింది. రూ.50 లక్షల నుంచి రూ.కోటి , రూ.1...5 కోట్ల ఆదాయం చూపిన వారి సంఖ్య 21 శాతం పెరిగింది. అయితే అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... రూ.5...10 కోట్లకు పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య 28.3 శాతానికి రయ్ మంటూ వెళ్ళిపోయంది. రిటర్న్స్ ఫైల్ చేసిన వారి వివరాల ద్వారా విస్తుపోయే ఈ వివరాలన్నీ వెలుగు చూస్తున్నాయి.
చాలా మంది కొత్త ఆదాయపు పన్ను విధానానికే మొగ్గు చూపారు. ఈ విధానం ద్వారా వార్షికాదాయం రూ.12 లక్షల దాకా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే హై ట్రాన్సాక్షన్ల సమాచారం వివిధ మార్గాల ద్వారా ఆదాయపు పన్ను శాఖకు అప్రయత్నంగానే చేరిపోతోంది. దీంతో పన్ను ఎగవేత దారులకు చెక్ పెట్టేందుకు మార్గం సులువవుతోంది. భారీ నగదుల పట్టివేత, నగదు లావాదేవీలపై నిఘా తదితరాలన్నీ కలిసొచ్చాయి. అయితే అంత మాత్రాన పన్ను ఎగవేత దారులు లేనే లేరా అనుకుంటే అది పొరపాటే అవుతుంది. నగదు లావాదేవీలు అసలు జరగట్లేదా అంటే సారీ అనాల్సి వస్తుంది. ఈ దేశంలో పన్ను ఎగవేసేది బడాబాబులే. అప్పులు ఎగ్గొట్టి దర్జాగా విదేశాలకు వెళ్ళిపోయిన వారిని సర్కారు ఏం చేయలేకపోతోంది. చెమటోడ్చి సంపాయించిన మధ్యతరగతి జీవుల నుంచి ముక్కుపిండి పన్ను వసూలు చేస్తున్నారు.
కలుగుల్లోంచి ఎలుకలు తప్పించుకుంటున్నా చూసీ చూడనట్లు వదిలేసి, చలిచీమల్ని కాలరాస్తున్నట్టుంది ప్రభుత్వ వైఖరి అని విమర్శిస్తున్న వాళ్ళు లేకపోలేదు. అందుకే ఈ దేశంలో పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. నిరుద్యోగాన్ని తగ్గించలేకపోతున్నాం, అవినీతి వ్యవస్థీకృతం కాకుండా అరికట్టలేకపోతున్నాం. బ్లాక్ మనీ విస్తృతంగా చెలమణి అవుతోంది. ఎన్ని ఏసీబీ దాడులు జరిగినా, ఇన్ కంటాక్స్ దాడులు జరిగినా, ఈడీలు వచ్చినా....నల్లడబ్బు జబ్బు తగ్గడమే లేదు. కోటీశ్వరుల సంఖ్య పెరిగిందని సంతోషిద్దామా...కడపు కాలే పేదల సంఖ్య మరింత పెరుగుతోందని బాధపడదామా?