ఎన్నికల్లో ఏఐ ప్రచారం.. రోబో డాగ్స్, ఎల్ఈడీ బ్యాగ్స్
జనవరి 15న బృహన్ ముంబయితో పాటు 28 కార్పొరేషన్లకు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి.;
టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న ఎన్నికల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. టీవీలు రాకముందు ఎన్నికల ప్రచారం కొందరి వద్దకే వెళ్లింది.. టీవీలు వచ్చాక పూర్తీగా మారిపోయింది. టీవీల తర్వాత డిజిటల్ మీడియా రాకతో జనానికి మరింత చేరువయ్యింది. ఇప్పుడు ఏఐ వంతు. ఏఐను కూడా వదలడంలేదు మన రాజకీయ నాయకులు. ప్రచారానికి కాదేదీ అనర్హం అన్నట్టు వాడకం మొదలయ్యింది.
ఏఐ ప్రచారం
జనవరి 15న బృహన్ ముంబయితో పాటు 28 కార్పొరేషన్లకు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల వద్దకు తమ సందేశం వెళ్లడానికి అనేక రూపాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. రోబో డాగ్స్ తో రాజకీయ నేతలు, అభ్యర్థుల ఫోటోలతో కొందరు ప్రచారం చేస్తుంటే.. మరికొందరు వీపు వెనకు ఎల్ఈడీ బ్యాగ్స్ తగిలించుకుని ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరు ఏఐ రీల్స్ చేసి వాటిని జనంలోకి వదులుతున్నారు. సోషల్ మీడియాను బలంగా వాడుతున్నారు. ఇంటింటికి వెళ్లి.. ప్రతి ఒక్కరినీ కలవాలంటే కష్టం. అందుకే అన్ని రకాల ప్రచార మాధ్యమాలను ప్రచారానికి వాడుతున్నారు. పూణే, పింప్రి చించ్వాడ్ ఎన్నికల ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చాట్ బాట్ తో మాటలు
కొందరు అభ్యర్థులు టెక్నాలజీని ఉపయోగించి ప్రజల సెంటిమెంట్ ను విశ్లేషిస్తున్నారు. చాట్ బాట్ లతో ప్రజలతో మాట్లాడుతున్నారు. తద్వారా ఎన్నికల వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. మార్చుకుంటున్నారు. గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకున్న పార్టీలు మైక్రో మేనేజ్మెంట్ కు బాగా వాడుతున్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఒక అంచనాకు వస్తున్నారు. అందుకు తగ్గట్టు విధానాలు, వ్యూహాలు మార్చుకుంటున్నారు. ఒకప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాతే విజయం ఎవరిదో తేలేది. కానీ ఇప్పుడు టెక్నాలజీతో ప్రజల అభిప్రాయాలను ముందే తెలుసుకుని, ఫలానా వారు గెలుస్తారనే అంచనాకు వస్తున్నారు.
గెలుపు మాత్రం వారిదే
ఎన్ని విధాలుగా ప్రచారం చేసినా.. ఎంత టెక్నాలజీ వినియోగించినా మంచి చేసే వారికే ప్రజలు పట్టం కడుతున్నారు. చాలా అంశాలను లెక్కలోకి తీసుకుని జనం ఓటు వేస్తున్నారు. ఇచ్చిన హామీలు.. నెరవేర్చుతారన్న నమ్మకం, గత ట్రాక్ రికార్డులాంటి అంశాలు కీలకం అవుతున్నాయి. ప్రచారం, ప్రలోభం కొంత వరకే పనిచేస్తోంది.