బాబు సర్కారులో వెయ్యి కోట్ల స్కాం జరిగిందా?

Update: 2016-05-28 06:11 GMT
ఓపక్క తిరుపతిలో ఏపీ అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగను ఘనంగా జరుపుకుంటున్న వేళ.. ఏపీ విపక్ష నేత జగన్ నేతృత్వంలో నడిచే ఆయన మీడియా సంస్థ ఏపీ సర్కారు మీద తీవ్ర ఆరోపణ చేసింది. వెయ్యి కోట్ల విలువ ఉన్న భూమికి సంబంధించిన భారీ కుంభకోణం ఒకటి జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచురించింది. ఓపక్క అవినీతి అన్న మాట లేకుండా తమ సర్కారు నడుస్తోందంటూ బాబు అండ్ కో గొప్పలు చెప్పుకుంటున్న వేళ.. అందుకు భిన్నంగా బాబు సర్కారులో జరిగిన ఒక భారీ కుంభకోణాన్ని తెర మీదకు తేవటం ఇప్పుడు సంచలనంగా మారింది.

సదరు కథనం ప్రకారం ఏపీ సర్కారుకు చెన్నై సమీపంలోని మహాబలిపురం రోడ్డులో 88 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి గుంటూరు జిల్లా అమరావతి దేవస్థానానికి సంబంధించిందిగా చెబుతున్నారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.వెయ్యి కోట్లు అవుతుందని.. అలాంటి విలువైన భూమిని కేవలం రూ.22కోట్లకే అధికారపార్టీకి చెందిన కట్టబెట్టారంటూ కథనాన్ని వెల్లడించింది.

ఎకరం ఆరు కోట్లు విలువన్న భూమిని.. ముఖ్యమంత్రి కార్యాలయం.. ఏపీ ముఖ్యనేత పుత్రరత్నం చక్రం తిప్పటం కారణంగా ఎకరా రూ.27లక్షలకే అమ్మేస్తూ నిర్ణయం తీసుకుందంటూ భారీ ఆరోపణ చేసింది. మార్కెట్ రేటుకు ఏ మాత్రం మ్యాచ్ కాని అతి తక్కువ ధరకు భూమిని అమ్మటానికి ఎలా అనుమతి ఇచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ భూమికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ లేఖ రాస్తే.. దానికి ఏపీ సీఎంవో ఓకే చేయటం.. ఈ భూమిని కాపు కార్పొరేషన్ ఛైర్మన్.. టీడీపీ నేత చలమలశెట్టి రామనుజయ్య ఫ్యామిలీ కొనుగోలు చేయటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ మీడియా సంస్థ లేవనెత్తిన అంశాలు సమంజసమైనవని.. ఎవరూ వేలెత్తి చూపించలేని విధంగా ఆరోపణలు ఉన్నట్లుగా చెబుతున్నారు. జగన్ మీడియా బయటకు తీసిన ఈ కథనం ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించటంతో పాటు.. పలు సందేహాలు వ్యక్తం చేసేలా ఉంది. మరి.. దీనిపై బాబు అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News