జహీరాబాద్ లో భూవివాదం.. ఆరు రౌండ్లు కాల్చేసిన రౌడీ షీటర్

Update: 2020-11-17 05:45 GMT
ఒక భూవివాదం వేళ.. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి.. చివరకు కాల్పుల వరకు వెళ్లిన వైనం ఇప్పుడు ఉలిక్కిపడేలా చేస్తోంది. జహీరాబాద్ లో సంచలనంగా మారిన ఈ ఉదంతం చూస్తే.. తెలంగాణలో సరికొత్త ట్రెండ్ షురూ అయ్యిందన్న సందేహం కలుగక మానదు. కొంతకాలం క్రితం వరకు హైదరాబాద్ మహానగరంలోనే భూముల విలువ భారీగా ఉండేది. అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో భూముల విలువలు భారీగా పెరుగుతున్న వేళ.. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొత్త ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవిండ్ పూర్ శివారులో కాల్పుల ఘటన కలకలాన్ని రేపింది. గోవింద్ పూర్ శివారులో 104.. 105 రెండు సర్వే నెంబర్లలో జహీరాబాద్ కు చెందిన కమల్ అనే వ్యక్తి పదిమేను మంది కూలీలతో కలిసి పొలం చుట్టూ కంచె కోసం రాళ్లు పాతిస్తున్నారు. ఆ భూమికి పక్కనే ఉన్న 109 సర్వే నంబరులో తమ భూమి ఉందంటూ జహీరాబాద్ కు చెందిన అలీ అక్బర్.. అతడి కొడుకు అష్రప్ అక్కడకు చేరుకొని గొడవ పడ్డారు.

ముందస్తు వ్యూహంలో భాగంగా అలీ అక్బర్ ముందే.. రౌడీ షీటర్ లాయిఖ్ ను రప్పించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటున్న వేళ.. రౌడీ షీటర్ లాయిఖ్ తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. కాల్పుల ఉదంతం పోలీసులకు తెలీయటంతో వారు రంగంలోకి దిగారు. నిందితుడ్ని పట్టుకునేందుకు మూడు టీంలు ఏర్పాటు చేశారు. తమకు భూమి ఉందంటూ లొల్లి పెట్టిన వారిపై కమల్ కంప్లైంట్ చేయగా..తాజాగా వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భూవివాదం సందర్బంగా కాల్పులు చోటు చేసుకోవటం అక్కడి వారంతా ఉలిక్కిపడేలా చేసింది.
Tags:    

Similar News