కేటీఆర్ ట్వీట్‌!...అస‌లైన బాహుబ‌లి ఇత‌డేన‌ట‌!

Update: 2017-12-31 11:48 GMT
బాహుబ‌లి... ద‌ర్శ‌క ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి ఏళ్ల త‌ర‌బ‌డి క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి తెర‌కెక్కించిన చిత్ర రాజం. ఈ చిత్రంలో ఆజానుబాహుడిగా బాహుబ‌లి పాత్ర‌లో క‌నిపించిన యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌... ఈ ఒక్క చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌గా మారిపోయాడు. మొత్తానికి బాహుబ‌లి భార‌తీయ చ‌ల‌న చిత్ర రికార్డుల‌ను తిర‌గ‌రాస్తే... త‌మిళ‌నాడుకు చెందిన ఓ ఫారెస్ట్ గార్డ్ కేవలం ఒకే ఒక్క ఫొటోతో ప్ర‌భాస్ త‌ర‌హా ప్ర‌చారం పొందాడు. అయినా స‌ద‌రు ఫారెస్ట్ గార్డ్ చేసిన ప‌నేమీ త‌క్కువ కాదు గానీ... ఏళ్ల త‌ర‌బ‌డి చేసిన క‌ష్టానికి ప్రభాస్ నేష‌న‌ల్ స్టార్‌గా మారితే.... కేవ‌లం ఓ ప‌ది నిమిషాల పాటు చేసిన ప‌నికి, ఆ ప‌నిలో ఉండ‌గా తీసిన ఒకే ఒక్క ఫొటోతో ఈ ఫారెస్ట్ గార్డ్‌... రియ‌ల్ బాహుబ‌లిగా పేరొందాడు. ఈ రియ‌ల్ బాహుబ‌లి ఫొటోను మీడియాలో చూసిన తెలంగాణ యువ మంత్రి కేటీఆర్ స్పందించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా నేటి ఉద‌యం కేటీఆర్ చేసిన ట్వీట్ నిజంగానే స‌ద‌రు ఫారెస్ట్ గార్డ్‌ ను రియ‌ల్ బాహుబ‌లిని చేసింద‌నే చెప్పాలి.

ఈ మొత్తం వ్య‌వ‌హారం వివ‌రాల్లోకి వెళితే... త‌మిళ‌నాడు అట‌వీ శాఖ‌లో ఫారెస్ట్ గార్డుగా ప‌నిచేస్తున్న శ‌ర‌త్ కుమార్ ఈ నెల ప్ర‌థ‌మార్ధంలో ఓ అంద‌రూ ఆశ్చ‌ర్య‌ప‌డే ప‌ని చేశారు. అడవిలో సంచరిస్తూ రోడ్డు మార్గం మీద‌కు ఓ ఏనుగుల గుంపు వ‌చ్చింది. అయితే ట్రాఫిక్ శ‌బ్దాల‌తో ఆ ఏనుగుల గుంపు అడ‌విలోకి ప‌రుగులు తీసే క్ర‌మంలో ఓ ఏనుగు పిల్ల ఓ గోతిలో ప‌డిపోయింది. దీంతో మిగిలిన ఏనుగుల‌న్నీ కూడా వెళ్లిపోగా... ఆ గున్న ఏనుగు త‌ల్లి మాత్రం పిల్ల ఏనుగు కోసం అక్క‌డే అరుస్తూ తిరిగింది. త‌న పిల్ల ఏనుగు కోసం ఆ త‌ల్లి ఏనుగు ఆర్త‌నాదాలు విన్న స‌మీప ప్రాంతాల ప్ర‌జ‌లు అట‌వీ శాఖాధికారుల‌కు స‌మాచారం చేర‌వేశారు. దీంతో శ‌ర‌త్ కుమార్ స‌హా ప‌లువురు అట‌వీ శాఖ సిబ్బంది అక్క‌డికి వెళ్లారు. ప‌రిస్థితి మొత్తాన్ని అర్థం చేసుకున్న సిబ్బంది ఎలాగోలా త‌ల్లి ఏనుగును అల్లంత దూరానికి త‌రిమేసి... పిల్ల ఏనుగును గోతిలో నుంచి పైకి తీసుకువ‌చ్చారు. అయితే అప్ప‌టికే చాలా నీర‌సించిపోయిన ఆ గున్న ఏనుగు అడుగు కూడా క‌దప‌లేక‌పోయింద‌ట‌. దీంతో రోడ్డుకు అవ‌త‌ల ఉన్న త‌ల్లి ఏనుగు వ‌ద్ద‌కు గున్న ఏనుగును తీసుకెళ్లేందుకు శ‌ర‌త్ కుమార్ పెద్ద సాహస‌మే చేశాడు.

ఏనుగు పిల్ల‌ను త‌న భుజాల‌పై వేసుకుని ప‌రుగు పెట్టాడు. ఈ దృశ్యం చూస్తే త‌ల్లి ఏనుగు ఎక్క‌డ మీద ప‌డుతుందోన‌ని మిగిలిన అట‌వీ సిబ్బంది బెంబేలెత్తిపోతే... శ‌ర‌త్ కుమార్ మాత్రం పిల్ల ఏనుగును త‌ల్లి ఏనుగు వ‌ద్ద‌కు చేర్చ‌డ‌మే త‌న ప‌ని అన్న‌ట్లుగా ముందుకు క‌దిలాడు. ఓ ప‌ది నిమిషాల పాటు వంద కిలోల‌కు పైగా బ‌రువున్న ఆ గున్న ఏనుగును అతి క‌ష్టం మీద రోడ్డు ఆవ‌ల‌కు తీసుకెళ్లిన శ‌ర‌త్‌.. అక్క‌డ దానిని కింద‌కు దించేసి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత కాసేప‌టికి ఆ గున్న ఏనుగును త‌ల్లి ఏనుగు వ‌చ్చి తీసుకెళ్లిపోయింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై నేటి త‌మ సంచిక‌ల్లో అన్ని ప్ర‌ధాన పత్రిక‌లు కూడా ప్ర‌ధాన శీర్షిక‌ల‌తో వార్త‌లు ప్ర‌చురించాయి. ఈ క‌థ‌నాల‌ను చూసిన కేటీఆర్‌... శ‌ర‌త్ కుమార్‌ ను నిజ‌మైన బాహుబ‌లిగా అభివ‌ర్ణిస్తూ... శ‌ర‌త్ ధైర్య సాహ‌సాల‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి కేటీఆర్ చేసిన ట్వీట్‌ తో శ‌ర‌త్ కుమార్ నిజంగానే రియ‌ల్ బాహుబ‌లిగా సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు.

Tags:    

Similar News