జగన్ ఆరోపణలపై టీడీపీ రియాక్షన్.. అమరావతి అసలు లెక్క ఇదే..

రాజధాని అమరావతి నిర్మాణ వ్యయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.;

Update: 2026-04-06 09:39 GMT

రాజధాని అమరావతి నిర్మాణ వ్యయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ అవినీతికి పాల్పుడుతున్నారని మాజీ సీఎం జగన్మోహనరెడ్డి, ఆయన పార్టీకి చెందిన సీనియర్ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మాజీ సీఎం జగన్ ఆరోపణలను ఖండిస్తూ తాజాగా టీడీపీ ట్వీట్ చేసింది. ఇందులో గత ఐదేళ్లలో కొత్తగా నిర్మించిన నూతన పార్లమెంట్, తెలంగాణ సచివాలయం, రుషికొండ ప్యాలెస్ నిర్మాణ వ్యయాన్ని, ప్రస్తుతం అమరావతికి చేస్తున్న వ్యయాన్ని వెల్లడించింది.

రాజధాని అమరావతి నిర్మాణ వ్యయంపై మాజీ సీఎం జగన్ విమర్శలను ఖండిస్తూ టీడీపీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆంధ్రుల కోసం కడుతున్న రాజధాని అమరావతి నిర్మాణ వ్యయంపై మాజీ సీఎం జగన్ అబద్దాలు ఆడుతున్నారని ఆ ట్వీటులో ఆరోపించింది. టీడీపీ అఫీషియల్ ఎక్స్ ఖాతా నుంచి వెలువడిన ట్వీట్ కు ఓ ఫొటో జత చేసింది. దానిలో ఢిల్లీలో నిర్మించిన పార్లమెంట్, తెలంగాణ సచివాలయం, రుషికొండ ప్యాలెస్ లను ఎంత విస్తీర్ణంలో నిర్మించారు. చదరపు అడుగుకు ఎంత వెచ్చించారు. ప్రస్తుతం అమరావతికి ఎంత ఖర్చుచేస్తున్నారన్నది సమగ్రంగా వివరించింది.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.12 వేలు ఖర్చు చేస్తున్నట్లు జగన్ అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ ధ్వజమెత్తింది. జగన్ ఆరోపిస్తున్నట్లు రూ.12 వేలు ఖర్చు చేయడం లేదని, పోనీ అలా అనుకున్నా ఆయన సొంత విలాసాల కోసం రుషికొండ ప్యాలెస్ కట్టడానికి చదరపు అడుగుకు రూ.35,714 ఖర్చు చేశారని? దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీసింది. పార్లమెంట్ భవనం, తెలంగాణ సచివాలయం, రుషికొండ ప్యాలెస్ కన్నా తక్కువ ఖర్చుతో రాజధాని అమరావతి భవనాలను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది.

టీడీపీ ట్వీట్ తో వైసీపీ ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిపై ఎదురుదాడికి దిగినట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటివరకు రాజధాని అమరావతి ఒక్కటే ఉంటుందని చెప్పడానికి మాత్రమే పరిమితమైన టీడీపీ ఇప్పుడు వైసీపీ చేస్తోన్న అవినీతి ఆరోపణలను సీరియసుగా పరిగణిస్తోందని ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతోందని అంటున్నారు. రుషికొండ ప్యాలెస్ కోసం చదరపు అడుగుకు రూ.35,714 ఖర్చుచేశారని ఎత్తిచూపుతూ రాజధాని అమరావతికి అందులో నాలుగోవంతు కూడా ఖర్చు చేయడం లేదని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేసిందని అంటున్నారు.

రాజధాని అమరావతిలో చదరపు అడుగుకు కేవలం రూ. 6,985 రూపాయలు ఖర్చు చేస్తున్నామని టీడీపీ తన ట్వీట్ లో వివరించింది. అదే సమయంలో ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు కన్నా ఎక్కువ వ్యయం అమరావతిలో చేస్తున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపణలను కూడా పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్లమెంటు నిర్మాణ వ్యయం, అమరావతికి చేస్తున్నఖర్చుల వివరాలను ట్వీటులో పొందు పరిచింది.




Tags:    

Similar News