‘కిస్సింగ్ డిసీజ్’తో జాగ్రత్త.. ప్రాణాంతక నరాల వ్యాధికి ముప్పు
ముఖ్యంగా యువతలో కనిపించే ఈ ఇన్ఫెక్షన్.. భవిష్యత్తులో నయం చేయలేని నరాల వ్యాధులకు పునాది వేస్తోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.;
మనం సాధారణంగా జ్వరం, గొంతు నొప్పి వస్తే వాతావరణం మారిందని సరిపెట్టుకుంటాం. కానీ, ‘కిస్సింగ్ డిసీజ్’గా పిలవబడే మోనోన్యూక్లియోసిస్ విషయంలో అలా నిర్లక్ష్యం వహించడం ప్రాణసంకటంగా మారే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో కనిపించే ఈ ఇన్ఫెక్షన్.. భవిష్యత్తులో నయం చేయలేని నరాల వ్యాధులకు పునాది వేస్తోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఏమిటీ ‘కిస్సింగ్ డిసీజ్’?
మోనోన్యూక్లియోసిస్ లేదా క్లుప్తంగా 'మోనో' అనేది ఎప్స్టీన్-బార్ వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఇది లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. అందుకే దీనికి ‘కిస్సింగ్ డిసీజ్’ అనే పేరు వచ్చింది. కేవలం ముద్దు పెట్టుకోవడం మాత్రమే కాదు.. ఒకరు వాడిన గ్లాసులు, బాటిళ్లు, చెంచాలు ఇతరులు వాడినా, లేదా బాధితులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా కూడా ఈ వైరస్ ఎదుటివారికి సోకుతుంది.
లక్షణాలు.. గుర్తింపు
ఈ వ్యాధి సోకినప్పుడు ప్రాథమికంగా ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం,గొంతు నొప్పి..మెడ, చంకలలో లింఫ్ నోడ్స్ (గ్రంధులు) వాపు... ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని విపరీతమైన నీరసం.. కొన్ని సందర్భాల్లో ప్లీహం వాపు లేదా కాలేయ సమస్యలు వస్తాయి. చాలా మంది దీనిని సాధారణ ఫ్లూ అనుకుని ఇంటి చిట్కాలతో సరిపెట్టుకుంటారు. కానీ వైరస్ శరీరంలో చేసే విధ్వంసం మాత్రం భయంకరంగా ఉంటోంది.
మల్టిపుల్ స్క్లెరోసిస్ (ఎంఎస్) ప్రమాదం: తాజా పరిశోధనల షాక్
ప్రముఖ వైద్య జర్నల్ ‘న్యూరాలాజీ ఓపెన్ యాక్సెస్’ లో ప్రచురితమైన తాజా కథనం ప్రకారం.. మోనో ఇన్ఫెక్షన్‌కు గురైన వ్యక్తుల్లో మల్టిపుల్ స్క్లెరోసిస్ (ఎంఎస్) వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.
మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఏమిటి?
ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థే మన స్వంత నరాల మీద దాడి చేస్తుంది. మెదడు, వెన్నెముకలోని నరాల చుట్టూ రక్షణ కవచంలా ఉండే 'మైలిన్' పొరను ఈ వైరస్ ప్రేరేపిత వ్యవస్థ దెబ్బతీస్తుంది. దీనివల్ల మెదడు నుంచి శరీర భాగాలకు అందే సంకేతాలు నిలిచిపోతాయి. చూపు మందగించడం.. కండరాల బలహీనత, నడకలో తడబాటు.. తీవ్రమైన పక్షవాతం లేదా వికలాంగత్వానికి దారితీసే అవకాశం ఉంది.
ఎప్స్టీన్-బార్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అది పూర్తిగా నశించకుండా సుప్తచేతనావస్థలో ఉండిపోతుంది. కాలక్రమేణా ఇది రోగనిరోధక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి నరాల క్షీణతకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
యువతలోనే ఎందుకు ఎక్కువ?
సాధారణంగా చిన్నపిల్లల్లో ఈ వైరస్ సోకితే లక్షణాలు తక్కువగా ఉంటాయి. కానీ, టీనేజర్లు, యువతీ యువకులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. కాలేజీలు, హాస్టళ్లలో ఉండేవారు వస్తువులను షేర్ చేసుకోవడం, సామాజికంగా సన్నిహితంగా మెలగడం వల్ల వైరస్ లోడ్ పెరిగి, అది మోనోగా మారుతోంది.
నివారణ మార్గాలు - జాగ్రత్తలు
ప్రస్తుతానికి ఈ వైరస్‌కు నిర్దిష్టమైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి ముందస్తు జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి. ఆహార పదార్థాలు, నీళ్ల బాటిళ్లు, గ్లాసులు లేదా టూత్ బ్రష్‌లు వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వైరస్‌ను తట్టుకునే శక్తిని పెంపొందించుకోవాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తిస్తే తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే ప్లీహం వాపు పెరిగి అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.
‘కిస్సింగ్ డిసీజ్’ అనేది కేవలం కొన్ని రోజుల జ్వరం కాదు. ఇది ఒక వ్యక్తి భవిష్యత్తును.. నరాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒక హెచ్చరిక. మీకు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అవసరం. అవగాహనే ఈ మహమ్మారి నుండి మిమ్మల్ని కాపాడే కవచం.