కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... తేడా వ‌స్తే ఏపీలో తెలంగాణ విలీనం

Update: 2022-02-16 17:30 GMT
గ‌త కొద్దికాలంగా తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ హాట్ విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును టార్గెట్ చేయ‌డంలో టీఆర్ఎస్ నేత‌లు ముందుంటున్నారు. పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్ నుంచి మొద‌లుకొని క్షేత్ర‌స్థాయిలో ఉన్న నాయ‌కుల వ‌ర‌కు ఈ ట్రెండ్ కొన‌సాగిస్తున్నారు.

అయితే,తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరుగుతూ తేడా వ‌స్తే మ‌న రాష్ట్రాన్ని ఏపీలో క‌లిపేస్తార‌ని ఆరోపించారు.

బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన మంత్రి కేటీఆర్.. రూ. 120 కోట్ల వ్య‌యంతో నిర్మించే సిద్ధాపూర్ రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం సిద్దాపూర్ గ్రామంలో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు.

దేశంలోని రైల్వేలు, ఎయిరిండియా, జీవిత బీమా లాంటి అనేక సంస్థ‌ల‌ను ప్ర‌ధాని మోడీ అమ్మేస్తున్నార‌ని కేటీఆర్ ఆరోపించారు. ``మీరు ఓ నాలుగు రోజులు అవ‌కాశం ఇస్తే తెలంగాణ‌ను తీసుకుపోయి మ‌ళ్లీ ఆంధ్రాలో క‌లిపేస్తడు. మ‌మ్మ‌ల్ని కూడా అమ్మేస్తాడు. బీజేపీ నాయ‌కుల లొల్లికి పొర‌పాటున యువ‌త ఆగ‌మైతే మ‌ళ్లీ తెలంగాణ‌ను, ఆంధ్రాను క‌లుపుత‌రు ఈ పుణ్యాత్ములు. అంత దారుణ‌మైన మ‌న‌షులు వీళ్లు`` అంటూ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మ‌తం ఏదైతేనేమి.. ర‌క్తం ఒక్క‌టే క‌దా? అని కేటీఆర్ ప్శ్నించారు. ``బీజేపీ నాయ‌కులు ముస్లింల మీద విషం చిమ్మ‌డం ప‌నిగా పెట్టుకున్నారు. తెల్లారిలేస్తే విషం నింపుడు, ద్వేష ప్ర‌చారం చేస్తున్నారు. మ‌న‌సు, శ‌రీరం నిండా విషం త‌ప్ప‌, విష‌యం లేదు. ఏడున్న‌రేళ్ల‌లో మోడీ తెలంగాణ‌కు ఏం ఇవ్వ‌లేదు.

157 మెడిక‌ల్ కాలేజీలు మంజూరైతే.. తెలంగాణ‌కు గుండు సున్నా. 87న‌వోద‌య పాఠ‌శాల‌లు మంజూరు చేస్తే.. తెలంగాణ‌కు గుండు సున్నా. కొత్తగా 8 ఐఐఎంలు మంజూరైతే తెలంగాణ‌కు గుండు సున్నా. 16 ఐసెర్‌లో ఇస్తే రాష్ట్రానికి ఒక్క‌టి కూడా ఇవ్వ‌లేదు. ఇందుకేనా మా కార్ల‌కు బీజేపీ కార్య‌క‌ర్త‌లు అడ్డం వ‌చ్చేది.`` అంటూ సెటైర్లు వేశారు.
Tags:    

Similar News