పిక్ టాక్: 28 ఏళ్ల తర్వాత తన స్నేహితులను కలుసుకున్న కేటీఆర్!

Update: 2022-05-01 11:30 GMT
కేటీఆర్ తన కాలేజీ రోజులను మర్చిపోలేదు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. గుంటూరు విజ్ఞాన్ లో కలిసి చదువుకున్న తన మిత్రులతో దాదాపు 28 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకొని సరదాగా గడిపారు. ఆనాటి ఫ్రెండ్స్, జ్ఞాపకాలను, స్నేహితులను ఇప్పుడు కలుసుకొని నాటి గురుతులను నెమరువేసుకున్నారు.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గత 48 గంటలుగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రాపర్టీ షోలో ఏపీ అభివృద్ధి, రాష్ట్ర పరిస్థితులపై వ్యాఖ్యానించి కేటీఆర్ దుమారం రేపారు. ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు లేవని కామెంట్ చేశాడు. దీంతో ఏపీ మంత్రులంతా కౌంటర్లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది.  కేటీఆర్ తన స్నేహితుడు అయిన జగన్ పాలనను అవమానించేలా మాట్లాడి ఇరుకునపడ్డారు. దీనికి ప్రతీకారంగా కేటీఆర్‌పై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు.

యాదృచ్ఛికంగా శనివారం సాయంత్రం కేటీఆర్ తన ఇంటర్మీడియట్ స్నేహితులను కలిశారు, అది కూడా 28 ఏళ్ల తర్వాత. ఈ కలయిక సందర్భంగా వారి ఫొటోను పంచుకున్నారు. “మంచి పాత స్నేహితులు వచ్చినప్పుడు ఇది ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.” అని తాను చదువుకునే రోజుల్లోని స్నేహితులతో దిగిన ఫొటోను షేర్ చేశారు. వడ్లమూడి క్యాంపస్‌లో కొన్ని వారాల క్రితం మేమంతా కలిసి ఉన్న ఫొటో ఇదీ అని ఆయన ట్వీట్ చేశారు

కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌లోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్ (ప్లస్ టూ) చదివాడు. అతను 91-93 బ్యాచ్‌ విద్యార్థి. ఈ చిత్రంలో ఉన్న వారిలో ఎక్కువ మంది ఇప్పుడు వైద్యులుగా ఉన్నారు. కేటీఆర్ అనంతరం  నిజాం కళాశాల నుండి మైక్రోబయాలజీని అభ్యసించారు. తరువాత అమెరికా వెళ్లి అక్కడ ఎంబీఏ చదివి ఉద్యోగం చేశాడు.

పాత మిత్రులతో ఘనంగా సమావేశమైన కేటీఆర్ ఈ వారాంతంలో రిలాక్స్ అయ్యి సేద తీరాడు. తాను ఓ సీఎం కొడుకుగా.. రాష్ట్ర మంత్రిగా.. ఓ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ పాత మిత్రులను కలుసుకోవడం ఎల్లప్పుడూ ప్రత్యేకమేనని ట్వీట్ లో కేటీఆర్ పేర్కొనడం విశేషం.

కేటీఆర్ ఎంత ఎదిగినా ఫ్రెండ్లీ, హుందాగా ప్రవర్తిస్తారనే పేరుంది. అలాగే సోషల్ మీడియా ద్వారా ఎవరైనా సమస్యలను తన దృష్టికి తీసుకెళితే దాన్ని చిటికెలో పరిష్కరిస్తానని అందరికీ తెలుసు. ఏపీ రెండుగా విడిపోయినా.. ఆయన తనతో సాన్నిహిత్యం కలిగిన వాళ్లను మర్చిపోరని.. వాళ్లు ఏ స్థాయి వ్యక్తులైనా సోదరభావంతో వ్యవహరిస్తారని కేటీఆర్ పోస్ట్ కు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News