సీమాంధ్రుల ప్రేమకు ఫిదా అయిపోయిన కేటీఆర్
తన జన్మదినం సందర్భంగా భీమవరంలో కటౌట్లు ఏర్పాటు చేయడం, పండ్లు పంపిణీ చేయడం చూసి మురిసిపోయి...అప్పుడెప్పుడో ఓ సందర్భంలో...భీమవరం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా మళ్లీ ఎందుకు సీమాంధ్రుల ప్రస్తావన తీసుకువచ్చారు? అందులోనూ వారి అభిమానానికి ఫిదా అయ్యే అంతటి ఘట్టం ఏ జరిగిందని ఆలోచిస్తున్నారా? నేరుగా కేటీఆర్‌కు ఎలాంటి ప్రేమను పంచలేదు కానీ...ఆయన తండ్రికికి దక్కిన ఆదరాభిమానాలతో యువమంత్రి ఇలా ఖుష్ అయ్యారయ్యారు.
ఇంతకీ ఏం జరిగిందంటే...ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవడం, ఆ వివాహం సందర్భంగా కేసీఆర్‌కు అనూహ్య రీతిలో ఆదరణ దక్కడం వంటివన్నీ తెలిసిన సంగతే!. ఒకదశలో తెలుగుదేశం నాయకులు కూడా కేసీఆర్‌కు అనంతలో అంత క్రేజ్‌ను ఊహించలేకపోయారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటి కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్ తన తండ్రికి సీమాంధ్రుల నుంచి దక్కిన ఆదరాభిమానాలను చూసి మురిసిపోయారు. ``రాష్ట్ర విభజనకు ముందు నాటి పరిస్థితులు వేరు.. ప్రజలు చాలా మెచ్యూర్డ్‌గా వ్యవహరిస్తున్నారు`` అంటూ కితాబిచ్చారు.
కాగా, కేటీఆర్ స్పందనపై నెటిజన్లు సైతం అదే రీతిలో స్పందించారు. కొందరు తెలంగాణవాదులు ఇటు కేటీఆర్‌ను, అటు కేసీఆర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. జనహృదయ నేతకు ఇటు స్వరాష్ట్రంలో, అటు పొరుగు రాష్ట్రంలోనూ విశేష ఆదరణ దక్కుతోందని పలువురు టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణవాదులు ట్వీట్ చేశారు. సీమాంధ్రుల మనోభావాలను సరైన రీతిలో వ్యక్తీకరించారని పలువురు కేటీఆర్ ను ప్రస్తావించారు. కాగా, గతంలో విమర్శించిన నాయకులు ఇప్పుడు సీమాంద్రులను పొగడటంలో మర్మం ఏంటని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు!