ఉత్తమ్ సర్వే ఉత్తుత్తేనంటూ బాంబు పేల్చాడు

Update: 2017-02-18 04:54 GMT
మిగిలిన రాజకీయ పార్టీలకు.. కాంగ్రెస్ పార్టీకి ఓపెద్ద వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్ ను ఆ పార్టీ ప్రత్యర్థులు దెబ్బేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆ పనిని సొంతపార్టీ నేతలే చేసేస్తారు మరి. అధికారంలో ఉన్నప్పుడు అసంతృప్తి సహజం. అదికారం చేతిలో లేనప్పుడు.. పోయిన పవర్ తిరిగి తెచ్చుకోవటం కోసం కలిసి కట్టుగా పని చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం పవర్ ఉన్నా.. లేకున్నా..వారి తీరు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వం వద్దకు వెళ్లి.. మీరు తెలంగాణ ఇవ్వండి.. పార్టీని పవర్ లోకి తెచ్చేస్తామన్న తెలంగాణ కాంగ్రెస్ నేతల అసలు బలం ఏమిటన్నది ఎన్నికల తర్వాత కానీ అసలు ముచ్చట అర్థం కాలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పవర్ పోయినా.. కాంగ్రెస్ నేతల్లో బుద్ధి వస్తుందా? అంటే రాలేదనే చెప్పాలి. కేసీఆర్ లాంటి బలమైన నేత ఉన్నప్పుడు.. ఆయన్ను ఢీ కొడుతున్నప్పుడు.. లోపలున్న విబేదాల్ని పక్కన పెట్టి మరీ పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అలాంటిదేమీ కనిపించదనే చెప్పాలి.

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము సర్వే జరిపామని.. పార్టీకి అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. 2019 ఎన్నికల వరకూ తానే పార్టీ రథసారధినన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా రియాక్ట్ అయ్యారు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉత్తమ్ అంటే పొసగని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ వెల్లడించిన సర్వే ఉత్తుత్తినే అన్న ఆయన.. తప్పుడు సర్వేలతో అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించొద్దన్నారు. అక్కడితో ఆగని ఆయన.. గడ్డాలు.. మీసాలు పెంచితే పవర్ చేతికి రాదంటూ (తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తన గడ్డం తీయనని ఉత్తమ్ గతంలో చేసిన సవాల్ పై పంచ్ వేస్తూ) ఉత్తమ్ కు ఎక్కడ తగలాలో అక్కడే తగిలే వ్యాఖ్యలు చేశారు.

2019వరకు తానే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ చెప్పుకోవటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కోమటి రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలీదని.. ఆయా సందర్భాల్లో అధినాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పటం ద్వారా.. ఉత్తమ్ పై తనకున్న అక్కసును వ్యక్తం చేసే పని చేశారు. కేసీఆర్ సర్కారును ఢీ కొనాలంటే నాడు వైఎస్ అనుసరించిన విధానమే సరైనదని.. కార్యకర్తల్ని.. ప్రజల్ని కలుపుకుపోయి పోరుబాట ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్నారు. ఇన్నిమాటలు చెప్పే కోమటిరెడ్డి.. అంతర్గత విభేదాలు పార్టీకి చేటు చేస్తాయన్న విషయాన్ని ఎందుకు గుర్తించనట్లు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News