ప్లేటు మార్చేసిన కోమటిరెడ్డి

Update: 2021-01-06 10:35 GMT
ఒక్కసారిగా కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్లేటు మార్చేశారు. తొందరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్లు తనంతట తానుగా తిరుమలలో ఓ ప్రకటనచేశారు. డిసెంబర్ 30 తేదీన చేసిన ప్రకటన జనవరి 4వ తేదీకల్లా మారిపోయింది. సాధారణ ఎన్నికలు మరో ఆరునెలల ముందు తన నిర్ణయం చెబుతానంటూ మాట మార్చేయటం విచిత్రంగా ఉంది. పార్టీ మారిపోతానని చేసిన ఎంఎల్ఏ ప్రకటనతో హ్యాపీగా ఫీలైన బీజేపీ నేతలు ఇపుడు తాజా ప్రకటనతో డీలా పడిపోయారు.

 నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి పట్టుందనటంలో సందేహం లేదు. దాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళిష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళంటే పడని నేతలను ముప్పుతిప్పలు పెడుతుంటారు. ఇపుడు తెలంగాణా పీసీసీ అద్యక్షుడి కోసం నేతల రేసు జరుగుతోంది. ఈ రేసులో ఉన్న వాళ్ళల్లో రాజగోపాలరెడ్డి బ్రదర్ కోమిటరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. తమ సోదరుడిని కాదని అధ్యక్ష పదవిని ఇంకెవరైనా ఎగరేసుకుపోతారేమో అన్న టెన్షన్ రాజగోపాల్లో పెరిగిపోతోంది.

ఇందులో భాగంగానే తాను కాంగ్రెస్ లో నుండి బీజేపీలో చేరిపోతున్నట్లు ప్రకటించారు. ఇలా ఎందుకు  ప్రకటించారంటే అధ్యక్షపదవి విషయంలో అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేయటమే ఉద్దేశ్యం. తన సోదరుడికి పీసీసీ అద్యక్ష పదవి దక్కించుకోవటమే రాజగోపాలరెడ్డి టార్గెట్. అంతేకానీ బీజేపీలో చేరటం ఆయన లక్ష్యంకాదు. ఇదే సమయంలో  తన ప్రకటన తర్వాత ఎంఎల్ఏకి తెలిసి వచ్చిందేమంటే తాను బీజేపీలో చేరితే తన పదవి పోతుందని. అంటే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీలో చేరితే కాంగ్రెస్ చూస్తు ఊరుకోదు కదా.

 ఈ విషయంలో మాత్రం ఎంఎల్ఏకి మంచి క్లారిటి ఉంది. అందుకనే పదవి వదులుకుని బీజేపీలోకి వెళ్ళటం తనకిష్టం లేదని చెప్పేశారు. అందుకనే ఎన్నికలు మరో ఆరునెలలు ఉందనగా అప్పటి పరిస్ధితులను చూసుకుని ఏదో నిర్ణయం తీసుకుంటానని స్పష్టంగా ప్రకటించేశారు. దాంతో కమలంపార్టీలోకి మారే విషయంలో  ఎంఎల్ఏ ప్లేటు మార్చేసిన విషయం స్పష్టమైపోయింది.
Tags:    

Similar News