బోస్ ను అవమానించారని తెలుగు తమ్ముడికి కోపం వచ్చిందే

Update: 2020-11-28 05:00 GMT
రాజకీయం భలేగా ఉంటుంది. అప్పటివరకు ప్రత్యర్థులుగా ఉంటారు.. అంతలోనే కలిసిపోతారు. దారుణంగా తిట్టేసి.. నిమిషాలు గడవక ముందే.. ఆత్మీయ ఆలింగనాలు రాజకీయాలకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఏపీ అధికార పార్టీ నేతల మధ్య నడుస్తున్న పంచాయితీలోకి తెలుగు తమ్ముడు ఒకరు ఎంట్రీ ఇవ్వటమే కాదు.. ఒకరికి వత్తాసు ఇస్తున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ పార్టీ నేతల మధ్య లొల్లి నడుస్తున్న విషయాన్ని హైలెట్ చేయటం ద్వారా..ర రాజకీయ లబ్థిని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశం తప్పించి మరింకేమీ లేదంటున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు.. అదే పార్టీకి చెందిన నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మధ్య నడుస్తున్న లొల్లి గురించి తెలిసిందే కదా. ఇటీవల వీరిద్దరి మధ్య పంచాయితీ మరింత ముదిరిన నేపథ్యంలో సీఎం జగన్ కల్పించుకొని ఇద్దరిని బుజ్జగించటంతో పాటు.. కాస్త కోపంగానే రియాక్టు అయిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఎంపీ బోస్.. తాజాగా ద్వారంపూడి ఇంటికి వెళ్లటం తెలిసిందే.

ఈ అంశంపై తాజాగా మాజీ మంత్రి కమ్ టీడీపీ నేత కొల్లు రవీంద్ర తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. పిల్లి బోస్ ను అనవసరంగా తిట్టి.. ఆయనకు క్షమాపణలు చెప్పకుండా.. ఇప్పుడు ఇంటికే పిలిపించుకొని అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. జగన్ బినామీగా చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు కాబట్టే.. బోస్ ను తన వద్దకు పిలిపించుకొని మరీ బోస్ ను తిట్టారని కొల్లు రవీంద్ర ఆరోపిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ లో బీసీల గొంతు నొక్కేస్తున్నారంటూ మండిపడ్డారు. బీసీలంటే ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని చెప్పటం చూస్తే.. తమ రాజకీయంలోకి కులాల్ని తీసుకురావటం ద్వారా లబ్థి పొందాలన్నట్లుగా కొల్లు వారి తీరు ఉందని చెప్పక తప్పదు. బోస్ మీద అభిమానం కంటే కూడా అధికారపార్టీ ఇమేజ్ ను ఆయన పేరుతో మరింత డ్యామేజ్ చేయాలన్నదే తెలుగుతమ్ముడి ఆరాటంగా ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News