బాసూ..ఈ కెప్టెన్ని మార్చేయ్.. డీకేపై ఫ్యాన్స్ ఆగ్రహ జ్వాల

Update: 2020-10-05 14:00 GMT
ఐపీఎల్లో ఏ జట్టు కెప్టెన్ పై లేని విధంగా క్రికెట్ ఫ్యాన్స్ దినేష్ కార్తీక్ పై మండిపడుతున్నారు.  అతడు ఏమాత్రం బ్యాటింగ్ చేయలేక పోతున్నాడని,  జట్టు  రెండు మ్యాచ్ లలో  ఓటమికి అతడే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ బ్యాటింగ్ లో ఏ మాత్రం దూకుడు లేదని, కెప్టెన్ గాను అతడి నిర్ణయాలు సరిగా లేవని ఆరోపిస్తున్నారు. అతడికి సారథ్య బాధ్యతలు తప్పించి మరొకరికి ఇవ్వాలని కోరుతున్నారు. కోల్ కతా జట్టు మొదటి నుంచి అంచనాలను మించే రాణిస్తోంది. స్టార్లకు కూడా ఆ జట్టులో కొదవలేదు. కానీ ఈ సీజన్ లో కోల్ కతా అంతగా ఆకట్టు కోవడంలేదు. కార్తీక్ నిర్ణయాల కారణంగా గెలవాల్సిన మ్యాచ్ లను కూడా కోల్పోవాల్సి వస్తోందని అభిమానులు ఆరోపిస్తున్నారు.

మొదట్లో గంగూలీ, ఆ తర్వాత మెక్ కల్లం కోల్ కతా జట్టును విజయవంతంగా నడిపితే ఆ తర్వాత గంభీర్ కెప్టెన్ అయ్యాక ఆ జట్టు పూర్తిగా మారిపోయింది . అంచనాలకు మించి ఆడింది.  అతడు రెండుసార్లు జట్టుకు  ట్రోఫీ అందించి ఛాంపియన్ గా నిలిపాడు. గంభీర్ ఓపెనర్ గా దిగుతూ తన దూకుడైన బ్యాటింగ్ తో ఎన్నో విజయాలు అందించాడు. అతడి కెప్టెన్ గా ఉన్నప్పుడు కోల్ కతా ఓ వెలుగు వెలిగింది. నిర్ణయాలు కూడా ఎంతో అద్భుతంగా తీసుకునేవాడు. దినేష్ కార్తీక్ కెప్టెన్ అయ్యాక జట్టు విజయాల సంఖ్య చాలా తగ్గి పోయాయి. అతడు ఎప్పుడూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ముందుకు నడిపింది లేదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ కెప్టెన్ గా అతడు సరైన చాణక్యాన్ని ప్రదర్శించడంలేదు. మోర్గాన్ వంటి ఆటగాడు బాగా ఆడుతున్నా అతడిని చివర్లో పంపుతూ కార్తీక్ మాత్రం ముందే వస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లు ఆడిన కార్తీక్ ముంబై తో జరిగిన మ్యాచ్ లో ౩౦ పరుగులు సాధించగా.. మిగిలిన మూడు మ్యాచ్ లలో వరుసగా 6,1,0 పరుగులే చేయడంతో కోల్ కతా ఫ్యాన్స్ అతడిపై మండిపడుతున్నారు.  కార్తీక్ ని కెప్టెన్సీ నుంచి తప్పించి మోర్గాన్ కు అప్పగించాలని  కోరుతున్నారు.
Tags:    

Similar News