దీదీపై ట్రోలింగ్.. మూమూలుగా లేదు!

ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నెటిజన్లకు మంచి కంటెంట్ అవుతున్నారు.;

Update: 2026-04-11 00:30 GMT

ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నెటిజన్లకు మంచి కంటెంట్ అవుతున్నారు. భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన దీదీ తన ఆస్తులపై సమర్పించిన అఫిడవిట్ లో వెల్లడించిన సమాచారంతో ట్రోలింగ్ కు గురవుతున్నారని అంటున్నారు. బెంగాల్ ను 15 ఏళ్లుగా పాలిస్తున్న దీదీ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఆమె సాదాసీదా నడవడికే. తెల్లని కాటన్ చీర, కాళ్లకు హవాయి చెప్పులు. 'మా, మాతి, మానుష్' (తల్లి, మట్టి, మనుషులు) అంటూ సామాన్యురాలిగా కనిపించడానికి ప్రాధాన్యమిచ్చే దీదీ దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రి రికార్డు కోసం తన ఎన్నికల అఫిడవిట్ లో కేవలం రూ.16 లక్షల లోపు ఆస్తులను చూపారని అంటున్నారు.

యాపిల్ వాచీపై సెటైర్లు

అఫిడవిట్ లో ముఖ్యమంత్రి మమత వెల్లడించిన ఆస్తులపై విస్తృత చర్చ జరుగుతోంది. దీదీ తన దగ్గర కేవలం రూ. 45,000 నగదు మాత్రమే ఉందని చెప్పగా, దాన్ని పట్టుకుని నెటిజన్లు ట్రోల్స్ దాడి మొదలుపెట్టారు. "పాపం దీదీ.. ఇంత తక్కువ ఆస్తా!" అని జాలిపడుతున్నట్లు సెటైర్లు వేస్తున్నారు. మమత చేతికి ఉన్న యాపిల్ వాచ్, ఖరీదైన 'హూప్' ఫిట్‌నెస్ ట్రాకర్, వేలికి ఉన్న స్మార్ట్ రింగ్ ఫోటోలను వైరల్ చేస్తూ విమర్శల దాడిని తీవ్రంగా చేస్తున్నారు. మమత వద్ద ఖరీదైన వస్తువులు ఉన్నాయని చూపుతూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నెటిజన్ల లెక్కల ప్రకారం ముఖ్యమంత్రి మమత ధరించిన ఈ గ్యాడ్జెట్ల విలువ దాదాపు లక్ష రూపాయలకు పైనే ఉంటుందని చెబుతున్నారు. అంటే, ఆమె దగ్గర ఉన్న మొత్తం నగదు కంటే ఆమె చేతికి ఉన్న వాచీలే ఖరీదైనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

రచయితగా సంపాదన..

మమతా బెనర్జీ కేవలం రాజకీయ నాయకురాలే కాదు, ఆమె ఒక గొప్ప రచయిత్రి కూడా. వందకు పైగా పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల రాయల్టీ ద్వారా తనకు ఆదాయం వస్తుందని ఆమె చెబుతుంటారు. అయితే, ఒక పక్క లక్షల్లో రాయల్టీ వస్తుందని చెబుతూనే, మరోపక్క తన ఆస్తులు ఇంత తక్కువగా చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "చెప్పులు సాదావే అయినా.. ట్రాకర్లు మాత్రం స్మార్ట్ గా ఉండాలి" అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

మమతా మార్కు పాలిటిక్స్

15 ఏళ్లుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మమత ఆస్తులు ఇంత తక్కువగా ఉండటం గొప్ప విషయమే. కానీ, ఆమె లైఫ్ స్టైల్ చూస్తే మాత్రం అది 'లగ్జరీ'కి తక్కువగా ఏమీ లేదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. పేదరికానికి బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తూనే, హై-ఎండ్ టెక్నాలజీని వాడటం దీదీకే చెల్లిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆస్తుల ప్రకటనలో మమత చూపించిన పేదరికం ఆమె ధరిస్తున్న గాడ్జెట్లకు మధ్య పొంతన లేదని కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News