జాక్ పాట్ అంటే కిషన్ రెడ్డిదే!

Update: 2019-05-24 14:30 GMT
ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఎంపీగా నెగ్గుతారని ఎవరైనా అనుకుంటారా? ఎమ్మెల్యేగా  ఓడి అప్పటికి సరిగా మూడు నాలుగు నెలలు కూడా కాలేదు. అలాంటి వ్యక్తిని ఎంపీగా బరిలోకి దించడం అంటే సదరు  పార్టీకి అభ్యర్థి దొరకకపోవడం తప్ప మరోటి కాదని ఎవరైనా అనుకుంటారు! ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తి ఎంపీగా పోటీ చేయడం ఏమిటని దాన్నో కామెడీ చూస్తారు  ఎవరైనా!

అయితే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రజల చేతుల్లో ఉండే తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం ఎవ్వరి తరం కాదు. అందుకు నిదర్శనంలానే ఉంది సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా నెగ్గడం. పార్టీ ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొన్న సమయంలో అయినా కిషన్ రెడ్డి బీజేపీని అంటి పెట్టుకుని ఉండటం, ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడం జరుగుతూ వచ్చింది.

కేంద్రంలో బీజేపీ అధికారంలో లేని సమయంలో కూడా కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవారు. అలా ఎమ్మెల్యేగా మిగిలిపోతారు అనుకున్న ఆయనకు ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ  రాష్ట్ర సమితి హవాలో ఆయన ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు.

మరి ఒకటి పోతే ఇంకోటి దక్కుతుంది అన్నట్టుగా కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి పోతే.. ఎంపీ పదవి రెడీగా దక్కింది! అనూహ్యమైన విజయం దక్కింది. అంతేకాదు.. జాక్ పాట్ కిషన్ రెడ్డికి మంత్రి పదవి రూపంలో కూడా దక్కబోతోందట. తెలంగాణలో బీజేపీ పుంజుకున్న నేపథ్యంలో ఇక్కడి నేతలను మోడీ మరింతగా ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. కిషన్ రెడ్డికి కేంద్రంలో కనీసం సహాయమంత్రి పదవి అయినా దక్కడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తి నాలుగైదు నెలల్లో కేంద్రమంత్రి అయితే అంతకన్నా విచిత్రం  ఏముంటుంది!
Tags:    

Similar News