3 నెలలు జీతం సరే.. మునిగిన ఇన్ని రోజులకు లెక్కలకు వస్తారా?

Update: 2020-10-22 11:50 GMT
మాటలు కోటలు దాటుతాయి. కానీ.. ఖజానాలో నుంచి మాత్రం కాసులు తీసి రాష్ట్రాలకు ఇచ్చేందుకు కేంద్ర సర్కారుకు అస్సలు మనసు ఒప్పదు. ఈ నెల 14న భారీ వర్షం జాడించి కొట్టింది. ఆ దెబ్బకు హైదరాబాద్ మహానగరం ఆగమాగమైంది. సరిగా లెక్కలు వేయలేదు కానీ.. ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం జరిగితే.. అంతకు మించి అన్నట్లుగా ప్రజలకు జరిగిన నష్టం.. కష్టం మామూలుగా లేదని చెప్పాలి. సాధారణంగా  విపత్తు విరుచుకుపడినప్పుడు కేంద్రం వైపు రాష్ట్రాలు చూడటం మామూలే.

అలానే తాజా ఎపిసోడ్ లోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ వైపు చూశారు. అయినా.. ఎలాంటి సాయం అందలేదు. దీంతో.. దొరికిందే అవకాశం అన్నట్లుగా కేంద్రం తీరుపై గులాబీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీన్ని బీజేపీనేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీనేతల వాదన సరిగా లేదని చెప్పాలి. లెక్కలు కట్టి సాయం చేస్తానని చెప్పే బదులు.. ముందుగా.. వంద కోట్లో.. రెండు వందల కోట్లో.. లేదంటే వెయ్యి కోట్లో తక్షణ సాయం కింద ప్రకటించి..నిధులు విడుదల చేస్తే ఏం జరుగుతుంది?

అది మానేసి.. మేం తీరిగ్గా కేంద్ర కమిటిని పంపుతాం. వారు పరిశీలించి.. లెక్కలు కట్టి నివేదిక ఇచ్చిన తర్వాత.. తాపీగా అన్ని చూసి సాయం ప్రకటిస్తామని చెప్పటం అర్థం లేనిది. తాజాగా కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రాన్ని తప్పుపట్టటం సరికాదంటున్నారు. అదేమంటే.. తాను మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చానని.. కేంద్రం కూడా సాయం అందిస్తుందని.. కాస్త ఓపిక పట్టాలని చెబుతున్నారు.

నిజమే.. కిషన్ రెడ్డి మూడు నెలల జీతాన్ని ఇవ్వటం మంచి పరిణామమే. కాదని ఎవరు అనరు. కానీ.. వరద విరుచుకుపడి దగ్గర దగ్గర పది రోజులు అయ్యాక కూడా కమిటీ రాలేదు. అధికారుల ఇస్తున్న సమాచారం ప్రకారం.. కమిటీ సభ్యులు ఈ రోజు పర్యటిస్తారని చెబుతున్నారు. ఇంత ఆలస్యంగా ఎందుకు రావటం? అన్న సందేహం కలుగక మానదు. ఒకవేళ.. కాస్తఆగి వస్తే తీవ్రత తెలుస్తుందన్నదే ఉద్దేశం అయితే.. అడ్వాన్స్ గా కొంత సాయాన్ని ప్రకటిస్తే.. ఏ సమస్యా ఉండదు కదా? కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెనకేసుకురావటం మామూలే. కానీ.. మీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కవర్ చేయటం ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News