టీడీపీకి మూడోతరం నాయకత్వం.. లోకేశ్ శకం ఆరంభం

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు చోటుచేసుకుంది.;

Update: 2026-04-15 14:14 GMT

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు చోటుచేసుకుంది. పార్టీ భావినేతగా ఇన్నాళ్లు చెప్పుకున్న నారా లోకేశ్ కు పూర్తిస్థాయి పగ్గాలు అప్పగిస్తూ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా ఆకస్మాత్తుగా చంద్రబాబు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని టీడీపీలో చాలా కాలం నుంచి చర్చ నడుస్తున్నా, బుధవారం ఉరుములేని పిడుగులా విడుదలైన ప్రకటన టీడీపీలో నూతన ఉత్తేజం తీసుకువచ్చింది.

లోకేశ్ నిర్ణయాలే ఫైనల్

యువనేత నారా లోకేశ్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడంతో టీడీపీలో మూడో తరం పాలన ఆరంభమైందని అంటున్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నప్పటికీ లోకేశ్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడంతో ఇకపై కీలక నిర్ణయాలు అన్నీ అధికారికంగా లోకేశ్ తీసుకోనున్నారు. ప్రస్తుతం పార్టీలో లోకేశ్ నిర్ణయాలే అమలు అవుతున్నా, అవన్నీ చంద్రబాబు ఆలోచన కిందే అమలు అవుతున్నాయి. కానీ, ఇప్పటి నుంచి లోకేశ్ ఆలోచనలే శాసనంగా పార్టీని నడిపించనున్నాయని అంటున్నారు.

మూడో తరం పాలన

1982లో ఆవిర్భవించిన టీడీపీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్టీఆర్ సేవలు అందించారు. ఆయన నుంచి 1995లో పార్టీ బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు సుమారు 30 ఏళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన రికార్డు చంద్రబాబుదే. ప్రస్తుతం ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పటికీ కీలక బాధ్యతలు మాత్రం లోకేశ్ కు బదిలీ చేస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయం విస్తృత చర్చకు దారితీస్తోంది.

50 ఏళ్లు నడిపించే నాయకత్వం

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించడం కేవలం ఒక పదవీ బాధ్యత మాత్రమే కాదు, అది పార్టీలో ‘యువ శకానికి’ నాంది పలికినట్లేనని అంటున్నారు రాబోయే అర్ధశతాబ్దం పాటు పార్టీని అప్రతిహతంగా నడిపించే లక్ష్యంతో లోకేశ్ కు కీలక బాధ్యతలు అప్పగించారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న లోకేశ్ పార్టీలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చారు. ముఖ్యంగా కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే కార్యకర్తలను పార్టీ పరంగా ఆదుకునే ఈ ఆలోచన కార్యకర్తల్లో లోకేశ్ పట్ల అభిమానం పెరిగేలా చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.

డిజిటలైజేషన్ తో విప్లవాత్మక మార్పులు

లోకేశ్ రాజకీయ ప్రవేశం చేసిన తొలినాళ్లలో పార్టీ యంత్రాంగాన్ని ఆధునీకరించడంపై దృష్టి సారించారు. పార్టీ కేడర్ డిజిటలైజేషన్ చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు, సభ్యత్వ నమోదును పూర్తిగా డిజిటలైజ్ చేశారు. ఐటి సెల్ బలోపేతం చేయడంతోపాటు సోషల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో లోకేశ్ వ్యూహాలు పార్టీకి కొత్త ఊపిరినిచ్చాయి.

యువ గళంతో పార్టీకి కొత్త రక్తం

లోకేశ్ రాజకీయ జీవితంతోపాటు టీడీపీ చరిత్రలో ఆయన చేపట్టిన ‘యువగళం పాదయాత్ర’ ఒక మైలురాయిగా చెబుతున్నారు. దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ యాత్ర ద్వారా ఒక పరిపూర్ణ నాయకుడిగా లోకేశ్‌గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కారణంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ నేతల నుంచి ఏకగ్రీవ మద్దతు పొందారు. దీంతో ఆయన నాయకత్వంలో పార్టీ అతిపెద్ద మార్పు ఆశిస్తోంది. ముఖ్యంగా యువరక్తం ఎక్కించడం లోకేశ్ ప్రధాన కర్తవ్యంగా సూచిస్తున్నారు. 45 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీకి, నేటి తరం ఆలోచనలను జోడించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ పదవుల్లో చదువుకున్న యువతకు, కొత్త ముఖాలకు 40% ప్రాధాన్యత ఇవ్వాలనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్న లోకేశ్ సీనియర్ నాయకుల అనుభవాన్ని గౌరవిస్తూనే, క్షేత్రస్థాయిలో పనిచేసే యువ కార్యకర్తలకు గుర్తింపునిస్తూ పార్టీలో సమతుల్యతను తీసుకువస్తున్నారని అభినందనలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో లోకేశ్ కు దక్కిన గుర్తింపు టీడీపీలో నవశకానికి నాంది పలికినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News