పాత లెక్కలు.. కొత్త జిల్లాలు.. ఏపీ, టీఎస్ లో విభజన సవాళ్లు

దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సమాయుత్తమైంది.;

Update: 2026-04-15 15:30 GMT

దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సమాయుత్తమైంది. గురువారం నుంచి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల సంఖ్య పెంపు, పునర్విభజనపై రాజ్యాంగ సవరణకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే కేంద్ర నిర్ణయం అనేక ప్రశ్నలకు తెరలేపుతోందని అంటున్నారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పునర్విభజన సవాల్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు.

టార్గెట్ 2029

2011 జనాభా లెక్కలు ఆధారంగా పునర్విభజన చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం జనాభా గణన కార్యక్రమం మొదలైనప్పటికీ, పాత లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దీనికి పలు ముఖ్య కారణాలను చూపుతోంది. 2029 ఎన్నికల నాటికి పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి కొత్త నియోజకవర్గాలతోనే ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. తాజాగా నిర్వహిస్తున్న జనగణన ప్రకారం పునర్విభజన చేయాలంటే 2029 ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదనే కారణంగా 2011 జనగణన లెక్కల ఆధారం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

రెండు రాష్ట్రాల్లో ఒకటే పరిస్థితి

అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలో మరెక్కడా సమస్య రాకపోయినా, ఏపీ, తెలంగాణలో మాత్రం పలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 2011 జనగణన తర్వాత రాష్ట్ర విభజన జరగడంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల స్వరూపంలోనూ మార్పులు వచ్చాయని చెబుతున్నారు. 2011లో జనగణన చేపట్టిన సమయంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉండేది. అప్పట్లో 25 జిల్లాలు మాత్రమే ఉండేవి. ఈ జిల్లాల ఆధారంగానే జనగణన పూర్తి చేశారు. ఇప్పుడు పాత లెక్కల ఆధారంగానే నియోజకవర్గాలు పునర్విభజన చేస్తామంటున్నారు. అయితే అప్పట్లో ఒకే రాష్ట్రంగా ఉన్న ఏపీ రెండుగా విడిపోవడంతోపాటు రెండు రాష్ట్రాల్లోనూ కొత్త జిల్లాలు పుట్టుకురావడం విభజన ప్రక్రియకు అవాంతరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

పాత లెక్కలతో సాధ్యమా?

ఈ పరిస్థితుల్లో పాత లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమా? అన్న ప్రశ్న ఉదయిస్తోందని అంటున్నారు. 2011 తర్వాత ఏపీ రెండుగా విడిపోవడం విభజిత ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు 13 నుంచి 28కి పెరిగాయి. అదేవిధంగా తెలంగాణలో పది జిల్లాలు 33 అయ్యాయి. అంతేకాకుండా విభజన సమయంలో తెలంగాణ పరిధిలో ఉన్న కొన్ని మండలాలను ఏపీలోకి తీసుకువచ్చారు. ఆయా మండలాలను ఏపీలోని రంప చోడవరం నియోజకవర్గంలో చేర్చారు. అప్పటివరకు ఈ మండలాలు తెలంగాణలోని ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉండగా, విభజన అనంతరం అరకు పార్లమెంటు పరిధిలో చేర్చారు.

తెలంగాణలో కొత్త మండలాలు కూడా..

ఇప్పుడు పాత లెక్కల ప్రకారమే విభజన అంటే అప్పట్లో ఉన్న ఉమ్మడి జిల్లాల ఆధారంగా నియోజకవర్గాలను విభజించాల్సివుంటుందని అంటున్నారు. అయితే తెలంగాణలో జిల్లాలతోపాటు కొత్త మండలాలను ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి పోలవరం నిర్వాసిత మండలాలు ఏపీలోకి మారడం కూడా సమస్యగా మారవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమస్యను కేంద్రం గుర్తించిందా? లేదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ విషయమై ముందుగా క్లారిటీ లేకపోతే, విభజన ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2029 ఎన్నికల నాటికి పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యమయ్యే పరిస్థితి ఉండదని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News