టీటీడీపీ, బోర్డు ఉంది.. బాస్ లేరు! ఈ సారికి ఇంతే సంగతులు!
తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీతోపాటు ఏపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కమిటీని విస్మరించింది.;
తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీతోపాటు ఏపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కమిటీని విస్మరించింది. దీంతో తెలంగాణలో పార్టీ కేడర్ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తోంది. 2023 ఎన్నికల సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఙానేశ్వర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది. రాష్ట్ర కమిటీ భర్తీ చేయాలని తెలంగాణకు చెందిన నేతలు, కార్యకర్తలు అధిష్టానాన్ని ఎంతలా కోరుతున్నా, అధినేత చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఈ దిశగా దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. దీనిపై టీటీడీపీ కార్యకర్తలు అసంతృప్తి చెందుతున్నారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయినా కేడర్ మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉందని గతంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలు వెల్లడిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన టీడీపీ అధిష్టానం ఎన్నికల తర్వాత పార్టీని పటిష్ట పరిచే కార్యక్రమాన్ని వదిలేసిందని అంటున్నారు. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో టీడీపీ కేడర్ సొంతంగా పోరాడి అక్కడక్కడ విజయాలు నమోదు చేశారు.
ఈ పరిస్థితుల్లో అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ ను పలుమార్లు కలిసిన టీటీడీపీ నేతలు తమ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించాలని విన్నవిస్తున్నా, హైకమాండ్ మాత్రం ఎందుకనో వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన కార్యవర్గంలో కేవలం ముగ్గురు తెలంగాణ నేతలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. సీనియర్ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన నర్సింహులును పొలిట్ బ్యూరోలోకి తీసుకోగా, నన్నూరి నర్సిరెడ్డిని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు.
తాజా కమిటీల ప్రకటన తర్వాత తెలంగాణ విషయమై అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో భవిష్యత్తులోనూ తెలంగాణ రాష్ట్ర కమిటీ నియామకం జరిగే అవకాశం లేదని అంటున్నారు. చాలా కాలం నుంచి రాష్ట్ర కమిటీ కోసం డిమాండ్ వినిపిస్తున్నా, అధిష్టానం ఆ దిశగా ఎలాంటి కసరత్తు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ కేడర్ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందని నిట్టూరుస్తున్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు అవకాశం ఉన్నప్పటికీ అధినాయకత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, విపక్షమైన బీఆర్ఎస్ పార్టీలు టీటీడీపీ మద్దతు కోసం వెంపర్లాడుతున్న పరిస్థితుల్లో సొంత పార్టీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.