హైదరాబాద్‌ లో అసదుద్దీన్‌ పై కిరణ్‌కుమార్ రెడ్డి పోటీ?

Update: 2023-03-12 08:00 GMT
సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే... ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా ఆయన హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తారని చెబుతోంది. కాగా... నల్లారిని బీజేపీలోకి చేర్చుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దించుతారన్న వాదన ఒకటి బీజేపీలో వినిపిస్తోంది.

హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి వరుసగా నాలుగు సార్లుగా అసదుద్దీన్ ఒవైసీ గెలుస్తూ వస్తున్నారు. అంతకుముందు ఆయన తండ్రి సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ ఆరుసార్లు హైదరాబాద్ ఎంపీగా వరుసగా గెలిచారు. సలాఉద్దీన్ మరణం తరువాత 2004లో ఈ సీటు నుంచి పోటీ చేసిన అసదుద్దీన్ ఆ తరువాత 2009, 2014, 2019లోనూ వరుసగా గెలిచారు. అయితే... ఈ నాలుగు ఎన్నికలలో ఒకసారి మినహా మిగతా మూడుసార్లు బీజేపీ ఇక్కడ రెండోస్థానంలో ఉంటూ వస్తోంది. కానీ, అసదుద్దీన్‌కు , బీజేపీ అభ్యర్థికి మద్య ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటోంది.

2014, 2019లో డాక్టర్ భగవంతరావు ఈ నియోజవర్గంలో అసదుద్దీన్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో భగవంతరావు 2 లక్షల 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే... 2019 నాటికి ఆ తేడా 2 లక్షల 82 వేలకు పెరిగిపోయింది. నిజానికి 2014 కంటే 2019లో ఈ నియోజకవర్గంలో సుమారు లక్ష ఓట్లు తక్కువగా పోలయినప్పటికీ అసదుద్దీన్ మెజారిటీ మాత్రం సుమారు 80 వేలు ఎక్కువైంది. బీజేపీ అభ్యర్థికి 75 వేల ఓట్లు తగ్గాయి.

ఇలాంటి పరిస్థితులలో అసదుద్దీన్ ఒవైసీపై బలమైన అభ్యర్థి కోసం బీజేపీ చాలాకాలంగా వెతుకుతోంది. బీజేపీలో ఇప్పటికే ఉన్న నేతలలో కొందరి పేర్లు అధిష్ఠానం దృష్టిలో ఉన్నప్పటికీ వారిని ఈ స్థానానికి తీసుకొస్తే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ బలహీనపడుతుందనే ఆందోళన పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలోనే  అసదుద్దీన్‌పై బలమైన అభ్యర్థిని బయట నుంచయినా తేవాలని చాలాకాలంగా బీజేపీ చూస్తోంది.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2014లో రాష్ట్ర విభజనకు ముందు సమైక్యాంధ్రకు సీఎంగా ఉన్న కాలంలో అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీలపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఇద్దరూ జైలుకు వెళ్లారు. అంతవరకు పాతబస్తీలో, హైదరాబాద్‌లో ఎదురే లేదన్నట్లుగా ఉండే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆ దెబ్బతో చాలా వరకు అదుపులోకి వచ్చారని చెప్తారు. అంతకుముందు హైదరాబాద్‌లో అధికారులకు గన్ చూపించి బెదిరించడం, అధికారులను కొట్టడం వంటివి చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆ తరువాత ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడానికే జంకే పరిస్థితి వచ్చింది. పాతబస్తీ కింగ్‌లుగా పేరుపడిన ఒవైసీ బ్రదర్సే జైలుకు వెళ్లడంతో ఎంఐఎం దూకుడు తగ్గింది.

ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఒవైసీలను అంత బలంగా ఎదుర్కొన్నే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తప్ప ఇంకెవరూ కాదని అంటారు. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం వివాదంలోనూ కిరణ్, ఒవైసీల మధ్య ఘర్షణ నడిచింది. రాష్ట్ర విభజన విషయంలోనూ అఖిల పక్ష సమావేశాల సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీని ప్రతి సందర్భంలోనూ కిరణ్ సమర్థంగా అడ్డుకున్నారు. ఆ కారణంగానే ఇప్పటికీ అసదుద్దీన్ ఓ ఆరోపణ చేస్తుంటారు. కిరణ్ కుమార్ రెడ్డి కారణంగానే కాంగ్రెస్, ఎంఐఎంలు దూరమయ్యాయని అంటుంటారు.

అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఒవైసీపై పోటీ చేయించే మాస్టర్ ప్లాన్‌లో బీజేపీ ఉందని తెలుస్తోంది. ఇక కిరణ్ విషయానికి వస్తే ... 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఆ తరువాత రాష్ట్రం విడిపోవడంతో జైతెలంగాణ అనే పార్టీ పెట్టి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేశారు.

అయితే... ప్రజలు ఆయన్ను, ఆయన పార్టీని ఆదరించలేదు. సీట్లు గెలుచుకోకపోవడమే కాకుండా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరిన ఆయన అక్కడ కూడా ఏమీ యాక్టివ్‌గా లేరు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం టెక్నికల్‌గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వాస్తవంగా అయితే ఆ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం కానీ ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉండడం కానీ చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ దృష్టి ఆయనపై పడిందని.. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిగాయని తెలుస్తోంది. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారని ఆయన అనుచరుల నుంచి వినిపిస్తోంది. అయితే.. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన బీజేపీలో చేరినా ఏపీలో రాజకీయం చేయకుండా హైదరాబాద్ కేంద్రంగా బ్యాటింగ్ చేస్తారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News