టీ రూ.10... విమానాశ్రయానికి వచ్చేసింది.. మల్టీఫ్లెక్స్ మిగిలుంది!
ప్రతీదీ సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చినప్పుడే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగినట్లు అని అంటుంటారు!;
ఒకప్పుడు ఎగుమ మధ్యతరగతి ప్రజలు, ధనవంతులు మాత్రమే విమాన ప్రయాణాలు చేసేవారు! దీంతో.. వారిని దృష్టిలో పెట్టుకునో, లేక.. వారు ఈ విషయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోరనో.. కారణం ఏదైనా, మరేదైనా.. విమానాశ్రయాలంటే ఒకప్పుడు విలాసవంతమైనవిగా పరిగణించబడేవి. అయితే మారుతున్న జీవనశైలి, కాలానికి అనుగుణంగా సామాన్యులు సైతం విమానంలో ప్రయాణించాలని కోరుకుంటున్నారు.
ప్రతీదీ సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చినప్పుడే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగినట్లు అని అంటుంటారు! ఈ క్రమంలో ఎయిర్ పోర్టులోని ఆహార, ఇతర సేవలు సైతం భయాందోళనలు కలిగించకుండా.. భారంగా కాకుండా ఉండేలా తాజాగా హైదరాబాద్ విమానాశ్రయం విషయంలో సైతం ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఇకపై రూ.10 కే టీ, రూ.20 కే కాఫీ, అందుబాటు ధరల్లో స్నాక్స్ ఆస్వాదించవచ్చు.
అవును... ఇప్పటికే కోల్ కతా, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, పూణె విమానాశ్రయాల్లో అందుబాటులోకి వచ్చిన 'ఉడాన్ యాత్రి కేఫ్'.. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చొరవతో ఇప్పుడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో.. ప్రయాణికులు ఇకపై రూ.10కి టీ తీసుకోవచ్చు.. వడ పావ్, కాఫీ, సమోసాలు, స్వీట్లు రూ.20కి తినవచ్చు! దీంతో.. ఇది సూపర్ గుడ్ న్యూస్ అంటున్నారు ప్రయాణికులు!
ఈ సందర్భంగా స్పందించిన అధికారులు.. ఇది అన్ని ప్రయాణీకులకు విమాన ప్రయాణాన్ని సరసమైనదిగా, మరింత సౌకర్యవంతంగా చేయడానికి రూపొందించబడిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు... ఈ తరహా కేఫ్ లు నగరంలోని మల్టీ ఫ్లెక్స్ థియేటర్స్ లోనూ రావాలని.. అక్కడ కూడా రూ.10 కి టీ, రూ.20 కి కాఫీ.. రూ.25 కే సమోసా, పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ లభించాలని.. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు!