మాజీ ప్రధాని మిస్టీరియస్ డెత్....
లాల్ బహద్దూర్ శాస్త్రి....భారత్ రెండో ప్రధాని. పొట్టిగా ఉన్నా దేశాన్నేలిన గట్టినేతగా అందరికీ చిరపరచితులు. అక్టోబర్ రెండు గాంధీజీ పుట్టినరోజు జరుపుకొంటాం.;
లాల్ బహద్దూర్ శాస్త్రి....భారత్ రెండో ప్రధాని. పొట్టిగా ఉన్నా దేశాన్నేలిన గట్టినేతగా అందరికీ చిరపరచితులు. అక్టోబర్ రెండు గాంధీజీ పుట్టినరోజు జరుపుకొంటాం. కానీ చాలా మందికి అదేరోజు లాల్ బహద్దూర్ శాస్త్రి జన్మదినమని తెలీదు. భారత్ ప్రధానిగా...సమర్థ నేతగా శాస్త్రి చెదరని ముద్ర వేశారు. అయితే లాల్ బహద్దూర్ శాస్త్రి ఆకస్మిక అనూహ్య మరణం ఇప్పటికీ చిక్కువీడని మిస్టరీగానే చరిత్ర పుటల్లో మిగిలిపోయింది. అదీ తాష్కెంట్ లో మరణించడంతో ఈ మిస్టరీ హిస్టరీలోనే మరింత మిస్టరీ గా మారింది. నిరాడంబరతకు, నిజాయతీకి నిలువెత్తు సాక్ష్యంలా నిలిచి, తాను ఆచరించిందే పదుగురికి ఆదర్శంగా చాటిన శాస్త్రి 1966 జనవరి 11న తాష్కెంట్ లో మరణించారు. భారత్...పాక్ యుద్దం తర్వాత చారిత్రాత్మక తాష్కెంట్ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే శాస్త్రి దుర్మరణం పాలు కావడం యావత్ దేశ ప్రజల్ని తీవ్రంగా కలచివేసింది. అప్పటి నుంచి శాస్త్రి మరణం పై కమ్ముకున్న నీలినీడలు ఇప్పటికీ తొలగిపోలేదు.
తాష్కెంట్ లో రష్యా...భారత్ రాయబార కార్యాలయ వైద్యులు శాస్త్రి గుండెపోటుతో మరణించారని ధ్రువీకరించి ప్రాథమిక నివేదిక ఇచ్చినా...మరణానంతరం పోస్ట్ మార్టం నిర్వహించక పోవడంతోనే అసలు అనుమానాలు తలెత్తాయి. అనుమానాస్పద మృతిగా అందరూ భావించిన ఆ సమయంలో పోస్ట్ మార్టం నిర్వహించి ఉంటే ఇన్ని సందేహాలు చుట్టుముట్టేవి కానే కావు. అయితే సహజమరణమని చిత్రీకరించేందుకు గుండెపోటు అనడంతో సహజ మరణాలకు పోస్ట్ మార్టం నిబంధన లేదని తేల్చివేశారు. పైగా అప్పట్లో సోవియట్ యూనియన్ భారత్ కు మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. ఆ దేశంలోనే ఈ దుర్మరణ ఘటన చోటుచేసుకోవడంతో...పోస్ట్ మార్టం అంటూ మొదలెడితే అంతర్జాతీయంగా దౌత్యసంబంధాలు దెబ్బతినే ప్రమాదముందని భారత్ నోరుమెదపలేదని కొందరు విమర్శిస్తున్నారు. పైగా విదేశంలో మరణించడంతో పోస్ట్ మార్టం కోసం కుటుంబ సభ్యుల అనుమతితీసుకునే వీలు లేకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు.
అయితే శాస్త్రి మరణం మిస్టరీ వెనక ఎన్నో ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఇప్పటికీ ఉన్నాయి. నాటి ప్రముఖ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యార్ అప్పుడు శాస్త్రివెనక పర్యటనలో ఉన్నారు. వారు తమ ఆత్మకథలో బియాండ్ ద లైన్స్ లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. శాస్త్రి మృతదేహాన్ని గమనించినపుడు పలు అంశాలు అనిపించాయని తెలిపారు. ముఖం, చర్మం నీలిరంగులో మారి ఉండటం...శరీరం అసహజంగా ఉబ్బిఉండటం ఇవన్నీ చాలా అనుమానాస్పదంగా కనిపించినట్లు వివరించారు. నిజంగా గుండెపోటుతో మరణిస్తే ఈ అసహజ పరిణామాలు కనిపించవు. కాబట్టి కచ్చితంగా శాస్త్రి పై విషప్రయోగం జరిగిఉండవచ్చని కుల్దీప్ నయ్యర్ పేర్కొన్నారు.
వాస్తవానికి గుండెపోటుతో సహజంగా మరణిస్తే శరీరం రంగు మారే అవకాశాలుండవు. మెడిసిన్ సైన్స్ ప్రకారం గుండె కొట్టుకోవడం ఆగినపుడు రక్తప్రసరణ నిలిచిపోయి శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడుతాయి. దీనినే లివర్ మోర్టిస్ అంటారు. అలాగే విషప్రయోగం జరిగినా...ఊపిరి ఆడక మరణించినా ఇలాగే జరిగే అవకాశాలున్నందున శాస్త్రి మరణం ఎలా జరిగిందన్నది పెద్ద ప్రశ్నగా, చర్చగా మారింది. పోస్ట్ మార్టం నిర్వహించి ఉంటే ఇలాంటి అనుమానాలన్నిటికీ కచ్చితమైన సమాధానాలు దొరికి ఉండేవి. భారత్ చరిత్రలో ప్రధాని మరణం మిస్టరీగా మిగిలి ఉండేది కాదు.
లాల్ బహద్దూర్ శాస్త్రి గారికి గుండె సంబంధిత జబ్బులుండేవని తెలుస్తోంది. 1959..60 మధ్యలో తొలిసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి మందులు తీసుకుంటుండేవారు. డాక్టర్ల పర్యవేక్షణలో జాగ్రత్తగా ఉండేవారు. 1965లో యుద్ద సమయంలో శాస్త్రి నిర్విరామంగా శ్రమించడంతో పాటు విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. తాష్కెంట్ ప్రయాణానికి ముందు శాస్త్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నా...విపరీతమైన చలిప్రాంతం కావడం...శరీరానికి అది పడకపోవడం, తాష్కెంట్ ఒప్పందం సమయంలో అలవికాని ఒత్తిడికి గురికావడం ఇవన్నీ శాస్త్రి మరణానికి కారణమని మరో వాదన కూడా వినవస్తోంది. అయితే ఇప్పటికీ శాస్త్రి మరణం విషప్రయోగం వల్లనే అని నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంది. మన భారత్ రెండో ప్రధాని,, సమర్థ నేత, లాల్ బహద్దూర్ శాస్త్రి మరణం ఎప్పటికీ తేలని మిస్టరీగానే మిగిలిపోవడం ఓ చారిత్రక విషాదం.