స్త్రీ 'శక్తి'లో ఇదో మోసం.. కండెక్టర్లపై పెరిగిన నిఘా!
మహిళలు చెల్లించాల్సిన చార్జీల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఏ నెలకు ఆ నెల డబ్బు ఆర్టీసీకి జమ చేస్తోంది.;
మహిళల నుంచి ఒక్క రూపాయి వసూలు చేయకుండా పూర్తిగా ఉచితంగా అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’లో మోసానికి చోటు ఎక్కడిది? అన్న అనుమానాలు ఎవరికైనా రావొచ్చు. అయితే ఈ పథకంలో ప్రభుత్వాన్ని మోసం చేసేలా అక్కడక్కడ కొన్ని ఘటనలు నమోదు అవుతున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తొలుత కొన్నిచోట్ల మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ అవడంతో ప్రభుత్వం అప్రమత్తమైందని అంటున్నారు. ఆకస్మిక తనిఖీలు చేసి మోసాలకు అడ్డుకట్ట వేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించిందని సమాచారం.
ఏపీలో అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ పథకంలో కొందరు కండెక్టర్లు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇన్సెంటివ్ కోసం కక్కుర్తి పడుతున్న కొందరు కండెక్టర్లు బస్సులో మహిళా ప్రయాణికులు లేకపోయినా టికెట్లు కొడుతున్నారు. ఆర్టీసీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఈ విషయం వెలుగుచూసిందని అంటున్నారు. దీంతో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంస్థ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. గత ఏడాది ఆగస్టు 15న రాష్ట్రంలో స్త్రీశక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.
మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ఈ పథకం సజావుగా ఎలాంటి వివాదాలు, విమర్శలు లేకుండా అమలు అవుతోందని చెబుతున్నారు. ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఆధార్ కార్డు చూపి ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు మొదట్లో కొన్నిచోట్ల ఘర్షణలకు దిగినా, ఇప్పుడు అలాంటి వివాదాలకు వెళ్లకుండా సాఫీగానే ప్రయాణాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 92 శాతానికి చేరింది. దీంతో సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతోందని అంటున్నారు.
మహిళలు చెల్లించాల్సిన చార్జీల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఏ నెలకు ఆ నెల డబ్బు ఆర్టీసీకి జమ చేస్తోంది. ఇలా ఆరు నెలల్లో ఆర్టీసీకి రూ.1,714 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ప్రతి నెల సగటున 25 లక్షల మంది ప్రయాణికులు ఉచిత బస్సును వాడుకుంటుండగా, ఫిబ్రవరి నెలలో సగటు 26 లక్షలకు చేరిందని చెబుతున్నారు. ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరుతుండటం వల్ల కండెక్టర్లు, డ్రైవర్లకు ఇన్సెంటివ్ లను చెల్లిస్తున్నారు. వారిపై పని ఒత్తిడి పెరగడంతో వచ్చిన ఆదాయంలో కొంత వారికి పంచుతున్నారని అంటున్నారు.
అయితే కొందరు కండెక్టర్లు అతి తెలివితో ఇన్సెంటివ్ వస్తుందనే ఉద్దేశంతో స్త్రీశక్తి టికెట్లు కొడుతున్నట్లు చెబుతున్నారు. మరికొందరు మహిళా ప్రయాణికులు బయలు దేరే స్జేజి, దిగాల్సిన స్టేజిలకు కాకుండా దూరంగా ఉన్న స్టేజిలకు టికెట్లు కొడుతూ అధిక మొత్తంలో సర్వీసు చేసినట్లు చూపుతున్నారని అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వం నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ, తాము సొంత లాభం పొందుతున్నారు. అయితే దీనివల్ల పథకం లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది. ముందుగా ఇలాంటి పనులు చేయొద్దని కండెక్టర్లకు వార్నింగులు ఇవ్వాలని, అప్పటికీ వినకుంటే చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.