నోబెల్ కావాలా ట్రంపు నాయనా....

చదివేదేమో రామాయణము...సంసారంలో రావణయుద్ధం...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనస్థితికి ఈ వాక్యాలు సరిగ్గా సరిపోతాయి.;

Update: 2026-01-11 10:39 GMT

చదివేదేమో రామాయణము...సంసారంలో రావణయుద్ధం...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనస్థితికి ఈ వాక్యాలు సరిగ్గా సరిపోతాయి. తనకు నోబెల్ పురస్కారం ఆరునూరైనా కావల్సిందే...అదీ శాంతిదూతగా పురస్కారం అందుకోవాలని అతగాడి ఆకాంక్ష. అందుకు ట్రంప్ చెప్పే లెక్కలు చాలానే ఉన్నాయి. తాను కనీసం అరడజను పైగా యుద్ధాలను ఆపించానని, లేకుంటే ప్రపంచం దద్దరిల్లిపోయేదని వాదిస్తాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిందంటే అది కేవలం తన పుణ్యమే అని ప్రకటిస్తాడు. చూస్తుండండి రష్యా ఉక్రెయిన్ యుద్దం కూడా ముగిసిపోయేలా చేస్తానని అంటాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ నిజంగా అమెరికా అధ్యక్షుల వారికి యుద్ధాల వద్దనే ఉందా? ఇపుడు ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం వెరీ సింపుల్ ఓ వైపు వెనిజులా అధ్యక్షుణ్ని అమానవీయంగా నిర్బంధించి బేడీలు వేయించి మరీ తరలిస్తాడు...డెన్మార్క్ పై గురిపెట్టి గ్రీన్ ల్యాండ్ ఇస్తావా చస్తావా అని హూంకరిస్తాడు. కేవలం రష్యాతో చమురు కొంటోందని ఇండియాపై ఇష్టారీతిగా ప్రతీకార సుంకాలు విధిస్తాడు. మరి ఈ ధోరణిని ఏమనాలి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఎవరు ఎన్నివిధాలుగా విమర్శించినా...ట్రంప్ మహాశయుడి మనసులో మాత్రం నోబెల్ అదీ శాంతిదూతగా తనకు దక్కాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాడు. పాకిస్తాన్ ఎలాగూ బేషరతుగా తన మద్దతు ప్రకటిస్తోంది. మరి దానికి మరో దారి లేదు...ఆ విషయం కూడా మనం గమనించుకోవాలి. మరి ట్రంప్ మనస్థితి ఎలా ఉంటోంది? నోబెల్ తనకు దక్కేలా ఏం చేస్తే బాగుంటుంది? పలు పలు సందేహాలు, ప్రశ్నలు మనసులో కందిరీగల్లా ముసురుతునే ఉంటాయి. పైగా మన ట్రంపు చాలా గ్రేటు ఏదీ మనసులో దాచుకోడు. అది సంతోషమైనా సరే..కష్టమైనా సరే. అందుకే పలు సందర్బాల్లో తనకు నోబెల్ పురస్కారం ఇవ్వడం ఆ కమిటీ చేసుకున్న పూర్వజన్మ పుణ్యమే. మరి కమిటీ సభ్యులు ఎందుకు మీనమేషాలు లెక్కెడెతున్నారో నాకర్థం కావడం లేదని మీడియా ముఖంగా కస్సు బుస్సు అంటున్నాడు.

తాజాగా వెనిజులాను గుప్పెట్లో పెట్టుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ...అక్కడ నిక్షేపంలా ఉన్న చమురు నిక్షేపాలపై కన్నువేసినా...పైకి మాత్రం అధ్యక్షుడు నికొలస్ మధురొ మాదకద్రవ్యాలను యూఎస్ కు తరలించే మాఫియాతో చేతులు కలపినందుకే అతగాడిని నిర్బంధించినట్లు ఉదారంగా ప్రకటించాడు. అయితే కామెడీ ఏంటంటే..ట్రంప్ ఏ నోబెల్ శాంతి పురస్కారం నాక్కాకపోతే ఇంకెరికి వస్తుందని పురస్కార ప్రకటన ముందు దర్పాన్ని ప్రదర్శించాడో ...సరిగ్గా ఆ పురస్కారం వెనిజులా ప్రతిపక్షనేత మచాడో కు దక్కింది. మరి రక్తం మరిగిపోదాండీ....అందుకే ఏకంగా నోబెల్ పురస్కార కమిటీ తీరుతెన్నులపైనే వైరాగ్యం...నైరాశ్యం...అక్కసు కలబోసిన కామెంట్లు చేసి ఇక చేసేదేమీ లేక గమ్మునుండిపోయాడు.

ట్రంప్ నోబెల్ పురస్కారం గురించి ఇంతగా కలవరించడానికి, పలవరించడానికి అతని అనుచరగణాల పాత్ర కూడా చాలానే ఉంది. అనునిత్యం అతని పక్కన భజనబృందంలా డోలు, చిటికెలు వాయిస్తూ తవరు గొప్పవారు...తమంతటి వారికి ఆ పురస్కారం ఇవ్వడమంటే వారే దాని గౌరవాన్ని పెంచినట్లు. తమరు బేపికరుగా ఉండండి పురస్కారం పరిగెత్తుకుంటూ వచ్చి మీ ముందు నిలుచుని సలాం కొడుతుంది అని ఊబ్బించేసుంటారు కామోసు. అందుకే ఆరునూరైనా నూరు ఆరైనా సరే తనకు నోబెల్ రావల్సిందే అని మంకు పట్టు పట్టాడు. మరి ఆ పురస్కారం దక్కలేదు సరికదా దరిదాపుల్లో కూడా అవకాశాలు లేకుండా పోయాయి. ఈ సమయంలోనే చాలా మంది సంధిస్తున్న ప్రశ్నలు చాలానే ఉన్నాయి...అసలు ట్రంప్ కు నోబెల్ ఎందుకివ్వాలి? వెనిజులా అధ్యక్షుణ్ని నిర్బంధించినందుకా? ఇండియా తదితర దేశాలపై ఇష్టారీతిగా ప్రతీకార సుంకాలను విధించినందుకా? హెచ్1బీ వీసాలను కుప్పుస్వామి మేడ్ డిఫికల్ట్ లా మార్చేసి అగ్ర రాజ్యానికి మేధా వలస జరగకుండా అడ్డుగోడగా నిలిచినందుకా? అరాచకంగా డాలర్లు గుప్పించయినా సరే గ్రీన్ ల్యాండ్ ను సొంతం చేసుకుంటానని డెన్మార్క్ తో తొడగొట్టినందుకా? ఎందుకివ్వాలి అంటున్నారు.

ఇదంతా ఓ పక్క కలకలం రేపుతుంటే మరో పక్క పుండుమీద కారం చెల్లినట్లు వెనిజులా ప్రతిపక్షనేత మచాడో తనకు దక్కిన నోబెల్ పురస్కారాన్ని కావాలంటే ట్రంప్ కు ఇచ్చేస్తానని అంటుండటం. అసలు ఏంటీ మచాడో అరాచకం. వేళాకోళానికైనా వేళాపాళా ఉండొద్దా? చెట్టంత మనిషి ట్రంప్ పాపం శాంతి నోబెల్ రాలేదే అని మదనపడుతుంటే... వెక్కిరించినట్లు నాకిచ్చారుగా నీకిచ్చేయినా అనడం ఎంతవరకు సబబు? ట్రంప్ మనోభావాలు ఘోరంగా దెబ్బతినవా ఏంటి? ఏది ఏమైనా వచ్చేసారి అయినా మన శాంతి దూత ట్రంపన్నయ్యకు నోబెల్ పురస్కారం ఇవ్వాల్సిందే... అప్పుడు కూడా తప్పించారో...మీ శిరసు వేయి వ్రక్కలవుగాక....అంటున్నారు అభిమానులు.

Tags:    

Similar News