ఏపీ ఎంసెట్‌ పై కీలక ప్రకటన .. పరీక్ష ఎప్పుడో తెలుసా !

Update: 2021-06-19 07:30 GMT
ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీ ఎంసెట్ పరీక్షలను ఆగష్టు 19 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. అపరాధ రుసుము లేకుండా జూన్ 26 నుండి జూలై 25వ తేదీ వరకు ఎంసెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని చెప్పారు.

రూ. 500 ఫైన్‌ తో జూలై 26 నుండి ఆగష్టు 5 వరకు, అలాగే రూ. 1000 లేట్ ఫీజుతో ఆగ‌ష్టు 6 నుండి ఆగష్టు 10 వరకు, రూ. 5000 లేట్ ఫీజుతో ఆగ‌స్టు 11 నుండి ఆగష్టు 15 వరకు, రూ. 10 వేలు అపరాధ రుసుముతో ఆగ‌స్టు 16 నుండి ఆగష్టు 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌ సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను జూలైలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుండడంతో.. ప్రశ్న పత్రాల మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి నెలకు పైగా సమయం పడుతున్న నేపథ్యంలో ఆగస్టు చివర్లో లో ఎంసెట్‌ పరీక్ష నిర్వహించి సెప్టెంబర్ లో  అడ్మిషన్ల ప్రక్రియ, కౌన్సెలింగ్‌.. అక్టోబర్ లో క్లాసులు ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఇక ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు ఆయా యూనివర్సిటీలు వేరువేరుగా పీజీ సెట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఉన్నత విద్యలో ఉమ్మడి అకడమిక్‌ కేలండర్‌ ను తీసుకొచ్చేందుకు పీజీ సెట్‌ ను రాష్ట్రస్థాయిలో నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ లో  పీజీ సెట్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు సమాచారం.
Tags:    

Similar News