అనకొండ నాగరాజు వెనుక ఒక ఎంపీ ఆశీస్సులు

Update: 2020-08-16 06:15 GMT
ఒక్క డీల్ రూ.2కోట్లు. అందులో మొదటి విడతగా రూ.1.10 కోట్లు. ఇదంతా ఏ ల్యాండ్ అమ్మానికికో.. మరేదైనా ఖరీదైన ఆస్తి డీల్ కోసమో కాదు.. ఒక పని కోసం ఒక రెవెన్యూ అధికారి తీసుకున్న లంచం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కీసర ఎమ్మార్వో నాగరాజు వ్యవహారం ఇప్పుడు పలు ప్రశ్నలకు కారణంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. నాగరాజు వెనకున్న పెద్దలు ఎవరు? అన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది.

రెవెన్యూశాఖలో ఒక మామూలు స్థాయి అధికారి.. ఇంత భారీ డీల్స్ చేస్తున్నారంటే.. అతనొక్కడే ఇలాంటివి చేయలేడని.. వెనుక ఎవరో ఉంటారన్న మాట రెవెన్యూ వర్గాల నోటి నుంచే రావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ వాదనకు బలం చేకూరేలా ఒక ఎంపీతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించి అధికారపార్టీనే కాదు.. విపక్ష నేతలు ఎవరూ కూడా స్పందించక పోవటం.

ఒక భారీ తిమింగళం దొరికినప్పుడు రాజకీయ పక్షాలు స్పందించటం మామూలే. ఇందుకు భిన్నంగా ఎవరూ రియాక్టు కాకపోవటం చూస్తే.. నాగరాజు ఒక్కడే కాడని.. ఆయన వెనుక కనిపించని శక్తులేవో ఉన్నాయన్న వాదనకు బలం చేకూరినట్లు అవుతోంది. ఇదిలా ఉంటే.. మేడ్చల్ జిల్లా రాంపల్లి దాయరలో 19.39 ఎకరాల భూవివాదం రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఈ వివాదంలో ఒక ఎంపీ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఏసీబీ తనిఖీల్లో అంజిరెడ్డి కారులో ఎంపీకి సంబంధించిన లెటర్ పాడ్లు.. ఇతర పత్రాలు దొరికినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. సదరు ఎంపీ తన నిధుల నుంచి పలు డెవలప్ మెంట్ యాక్టివిటీస్ కోసం సిఫార్సు చేసినట్లుగా లేఖలు ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. అసలీ భూవివాదంలో సదరు ఎంపీ పాత్ర ఏమిటన్నది ప్రశ్నగా మారింది. రానున్న రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని చెబుతున్నారు. 
Tags:    

Similar News