కేసీఆర్ ఫ్రంట్ చ‌క్రం తిప్పేది హైద‌రాబాద్ నుంచేన‌ట‌

Update: 2018-03-09 05:33 GMT
రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని...కాంగ్రెస్‌ - బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ ఏర్పాటుకు సిద్ధ‌మ‌వుతాన‌ని టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. జాతీయస్థాయిలో ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని  ప్రకటించిన సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. విధివిధానాలను అన్ని రాజకీయ పార్టీల ముందు ఉంచుతానని ప్రకటించారు. విధివిధానాలు నచ్చినవారే తమతో కలిసివస్తారని, గుణాత్మక మార్పు కోసం అడుగు ముందుకు వేయడంలో తప్పు లేదు కదా అన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది. ఈ క్ర‌మంలో దీనికి సంబంధించిన కార్యాచ‌రణ ఎక్క‌డ జ‌ర‌గ‌నుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు హైదరాబాద్‌ లోనే జరుగనుంది.

ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి దేశంలోని ప్రముఖ నగరాల్లో సమావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇలా స‌మావేశాలు జరిగినా కసరత్తు మాత్రం హైదరాబాద్‌ కేంద్రంగానే జరుగుతుందని తెలుస్తోంది. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ, మరికొంత సమయాన్ని ఫ్రంట్‌ కోసం సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.మేధావులు - ప్రముఖులు - సీనియర్‌ అధికారులు - సంఘాల నేతల ఆలోచన ప్రకారం ఫ్రంట్‌ రూపుదిద్దుకుంటుందని టీఆర్‌ ఎస్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆయా పార్టీల నేతలతో మాట్లాడే సమయంలో జరుగుతున్న పరిణామాలనూ - ప్రత్యామ్నాయాలనూ వివరించేందుకు ఒక ముసాయిదాను రూపొందించే పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు.

టీఆర్ ఎస్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం త‌న భేటీకి సంబంధించి కేసీఆర్ ఒక స్ప‌ష్ట‌త‌తో ఉన్న‌ట్లు స‌మాచారం. ముందుగా సీపీఎం జాతీయ నేతలతో సమావేశం అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరితో మాట్లాడినట్టుగా సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ - బీజేపీలతో వెళ్లకూడదని సీపీఎం తీర్మానం చేయబోతున్న తరుణంలో మొదటుగా ఆ పార్టీ నేతలతోనే సమావేశం కావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఏప్రిల్‌లో హైదరాబాద్‌ లో సీపీఎం జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. అందులో భాగంగానే కేసీఆర్ ఆ పార్టీకి చెందిన జాతీయ నేతలు సీతారం ఏచూరి - ప్రకాశ్‌ కరత్‌ తో పాటు మరికొందరు నేతలను కలుస్తారని గులాబీల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలో ఏచూరితో మాట్లాడి షెడ్యూల్‌ ఖరారు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్‌ మొదటివారంలో ముగియనున్నాయి. సీపీఎం జాతీయ మహాసభలు కూడా ఏప్రిల్‌ రెండోవారంలో జరగనున్నాయి. ఆ సందర్భంగానే హైదరాబాద్‌లోనే ఈ భేటీలు ఉంటాయని తెలుస్తున్నది. జాతీయ ఫ్రంట్‌ కోసం సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో ఈ మహాసభలకు మరింత ప్రాధాన్యత ఏర్పడినట్టయిందని విశ్లేషకులు తెలిపారు. సీపీఐ జాతీయ నేతలను కూడా కలిసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Tags:    

Similar News