అర్జెంట్‌గా హైదరాబాద్‌ రమ్మన్నది ఎందుకు..?

Update: 2015-06-29 07:06 GMT
ఐదు రోజుల పాటు తన ఫాంహౌస్‌లో అల్లం పంట సాగు మీద దృష్టి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం ఫాంహౌస్‌ నుంచి బయలు దేరారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఐదురోజుల పాటు ఫాంహౌస్‌లో గడిపింది ఈసారే కావటం గమనార్హం.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఐదు రోజుల పాటు ఫాంహౌస్‌లో గడపటం.. అది కూడా తన సొంత పంట మీద శ్రద్ధ చూపిస్తూ ఉండిపోవటం ఎవరూ ఏమీ అనకున్నా.. ఇది మంచి పద్ధతి కాదన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యమంత్రి ఐదు రోజుల పాటు ఆఫీసుకు వెళ్లకపోతే.. ఫైళ్లు ఎంత భారీగా ఉండి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

ఫాంహౌస్‌ నుంచి తిరిగి వచ్చే సమయంలోనూ అల్లం పంటను చూసే కూలీలతో మాట్లాడిన కేసీఆర్‌.. తాను మళ్లీ వస్తానని.. ఆ లోపు అల్లం పంటను వేసి ఉంచాలని.. జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి బయలుదేరారు. ఇక.. హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే.. అధికారపార్టీ మంత్రులకు.. ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ ఒక నోట్‌ పంపారని చెబుతున్నారు. పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంతా తక్షణమే హైదరాబాద్‌కు రావాలన్న ఆదేశాలు ఒక చిన్న నోట్‌తో వెళ్లాయని చెబుతున్నారు.

ఉన్నట్లుండి ఇంత వేగిరమే రావాలని చెప్పటం ఎందుకన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓటుకు నోటు వ్యవహారంతో పాటు సెక్షన్‌ 8పై నిర్ణయాలకు ఈ వారమే కీలకమని భావిస్తున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరిని రాజధానికి ఎందుకు రమ్మన్నారన్నది ఇప్పుడు పెద్ద సందేహంగా మారింది.

Tags:    

Similar News