ఆ నీళ్లతో కాళ్లు కడుగుతాడంట

Update: 2015-07-04 10:03 GMT
ఒక్కో సీజన్‌లో ఒక్కోరకంగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ మధ్యన ప్రతి రోజూ ఒక కొత్త హామీని ఇస్తూ అందరిని ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి చేయటమే కాదు.. తర్వాతి రోజు ఎలాంటి వరం ఇస్తారోనన్న ఆసక్తిని రేకెత్తించారు.

అలా కొంతకాలం పాటు సాగిన వరాల జల్లుల కార్యక్రమాన్ని ఆయన తర్వాత ఆపేశారు. కొద్దికాలం పాటు అస్సలు వరాలే ఇవ్వటం మానేశారు. తాజాగా మళ్లీ మరోసారి వరాల ప్రక్రియ షురూ చేసినట్లుగా కనిపిస్తోంది.

హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన.. తన మాటలతో మనసుల్ని దోచుకుంటున్నారు. సిద్ధిపేటకు రాలేదన్న ఫిర్యాదు భవిష్యత్తులో ఎవరి నోట వినిపించకుండా ఉండేందుకు వీలుగా ఆయన కొన్ని మాటలు తాజాగా చెప్పారు. ఆయన మాటలు విన్నంతనే సిద్ధిపేట ప్రజలు మురిసిపోయేలా ఆయన మాటలు ఉన్నాయి.

తాను సిద్ధిపేట పర్యటనకు బయలుదేరితే..ఒక రైతు ఎక్కడికి వెళుతున్నారని అడిగారని.. సిద్ధిపేట అని చెప్పానని చెప్పిన కేసీఆర్‌.. సదరు రైతు చెప్పిన మాటల్ని ఇలా చెప్పుకొచ్చారు. ''సిద్ధిపేట నర్సిరీ మొక్క పెద్దదై.. చెట్టు అయి తెలంగాణకు నీడను ఇస్తోంది. ఇంకా సిద్ధిపేట వెళ్లేదేమిటి?'' అని ప్రశ్నించినట్లు చెప్పారు. సదరు రైతు చెప్పినట్లుగా తాను సిద్ధిపేట నర్సరీలో మొక్కనని.. అక్కడి వారి ఆశీర్వాదంతోనే ఇంతటివాడిని అయినట్లు చెప్పి.. సిద్ధిపేట ప్రజల మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారు.

తనింతటివాడ్ని చేసిన సిద్ధిపేట ప్రజల్ని తాను మర్చిపోలేనని.. సిద్ధిపేటకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ప్రజల కాళ్లు కడుగుతానంటూ లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌ను ప్రకటించేశారు. మరి.. మూడేళ్లలో సిద్ధిపేట కాళ్లు గోదావరి జలాలతో తడుస్తాయా లేదా? అన్నది కాలమే చెప్పాలి.

Tags:    

Similar News