కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారబ్బా

Update: 2019-05-18 13:18 GMT
తెలంగాణలో ఇప్పుడు సరికొత్త నేరాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని మాదిరిగా ఏకంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఉదంతం  తరహా నేరాలకు పరాకాష్ఠగా చెప్పాలి. ఈ సాహసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలక భూమిక పోషించింది మాత్రం అధికార టీఆర్ ఎస్ కు చెందిన నేతేనట. నిందితులు అడిగిందే తడవుగా సీఎం లెటర్ హెడ్ ను వారికి విక్రయించింది టీఆర్ ఎస్ కు చెందిన నేతేనన్న విషయం ఇప్పుడు పెను కలకలమే రేపుతోంది. ఇటు పోలీసు యంత్రాంగం - రెవెన్యూ యంత్రాంగంతో పాటు మొత్తంగా తెలంగాణ సర్కారునే షాక్ కు గురి చేసిన ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు నిందితులు అరెస్ట్ కాగా... మూడో వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే... తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరించే నిమిత్తం... రెగ్యులరైజేషన్ కు కేసీఆర్ సర్కారు తీర్మానించింది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా భూములను రెగ్యులరైజ్ కూడా చేశారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలిలోని  రెండు ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయాలంటూ రెవెన్యూ అధికారులకు కేసీఆర్ సంతకంతో కూడిన సీఎం లెటర్ హెడ్ వచ్చింది. దీనిపై అనుమానం వ్యక్తం - చేసిన రెవెన్యూ అధికారులు దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు ఆ లెటర్ హెడ్ పై ఉన్న సంతకం ఫోర్జరీ అని నిర్ధారించారు.

ఆ వెంటనే సదరు లెటర్ హడ్ ను రెవెన్యూ అధికారులకు అందజేసిన వారి వివరాలే సేకరించి నిందితులను పట్టేశారు. ఈ క్రమంలో నిందితులు వెల్లడించిన వివరాలు విన్న పోలీసులు షాక్ తిన్నారట. నిందితులకు అందిన సీఎం లెటర్ హెడ్ స్వయంగా టీఆర్ ఎస్ కు చెందిన ఓ నేత తమకు అందజేశారని - అందుకు గానూ తాము ఆ నేతకు రూ.45 వేలు ఇచ్చామని చెప్పారు. దీంతో షాక్ తిన్న పోలీసులు సదరు టీఆర్ ఎస్ నేత కోసం ముమ్మరంగా గాలిస్తున్నారట. ఏకంగా సీఎం లెటర్ హెడ్ నే సంపాదించడంతో పాటుగా దానిపై కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన నిందితులు ఇప్పుడు తెలంగాణ సర్కారుకు పెను సవాలే విసిరారని చెప్పాలి.
Tags:    

Similar News