ఆ రెండు ప‌నులు పూర్తి చేసుకొచ్చిన కేసీఆర్‌

Update: 2017-09-11 05:12 GMT
తెలంగాణ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక అల‌వాటు ఉంది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాదిరి త‌ర‌చూ ఏదో ఒక ప్రాంతానికి వెళ్ల‌టం.. దేశ రాజ‌ధానికి వెళ్ల‌టం (తాజాగా ముఖ్య‌మంత్రి అయ్యాక మొద‌ట్లో త‌ర‌చూ ఢిల్లీ వెళ్లినా.. మోడీ మైండ్ సెట్ అర్థ‌మ‌య్యాక త‌న ఢిల్లీ టూర్ ల‌ను చాలా మేర‌కు త‌గ్గించేసుకున్నారు).. విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేయ‌టం చేయ‌టం కేసీఆర్ లో క‌నిపించ‌దు.

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత కేసీఆర్ జ‌రిపిన విదేశీ ప‌ర్య‌ట‌న‌లు.. ఢిల్లీ టూర్ల లెక్క‌ చూస్తే.. మేం చెప్పే మాట‌లో నిజం ఎంత‌న్న‌ది అర్థ‌మ‌వుతుంది. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన ఆయ‌న‌.. కేంద్ర‌మంత్రుల్నిక‌ల‌వ‌టానికి అని చెప్పిన‌ప్ప‌టికీ.. ఈ ట్రిప్పులో మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఉంది.

గ‌డిచిన కొంత‌కాలంగా అదే పనిగా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతున్న కంటి శ‌స్త్ర‌చికిత్స‌ను (కాట‌రాక్ట్‌) ఆయ‌న చేయించుకోవాల‌నుకున్నారు. గ‌తంలో ప‌లుమార్లు కంటి ఆప‌రేష‌న్ కోసం ఢిల్లీకి వెళుతున్న‌ట్లు చెప్పినా.. ప‌లు కార‌ణాల‌తో ఆప‌రేష‌న్ చేయ‌లేదు. ఈసారి ఆప‌రేష‌న్ మాట ప్ర‌స్తావించ‌కుండా.. కేంద్ర‌మంత్రుల్ని కలిసేందుకు వెళుతున్న‌ట్లు చెప్పిన‌ప్ప‌టికీ.. కంటి ఆప‌రేష‌న్ చేయించుకోవ‌టం గ‌మ‌నార్హం.

కంటి ఆప‌రేష‌న్ అనంత‌రం విశ్రాంతి త‌దిత‌ర‌కార‌ణాల‌తో గ‌డిచిన ప‌ది రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ తాజాగా హైద‌రాబాద్ సిటీకి వ‌చ్చేశారు.  తాజా టూర్ విశేషం ఏమిటంటే.. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న రెండు అంశాలుగా చెప్పొచ్చు. అందులో ఒక‌టి.. త‌న క‌ల అయిన కొత్త అసెంబ్లీ.. కొత్త స‌చివాల‌యాన్ని సికింద్రాబాద్ బైస‌న్ పోలో మైదానంలో నిర్మించ‌టం. దీనికి త‌గిన‌ట్లే కేంద్ర‌ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చేసింది. దీనికి సంబంధించిన ప‌త్రాల‌పై కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ స‌మ‌క్షంలో సంత‌కాలు జ‌రిగాయి. ఇక‌.. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న కేసీఆర్ కంటి ఆప‌రేష‌న్ కూడా తాజా ప‌ర్య‌ట‌న‌లో పూర్తి అయ్యింది. ఆప‌రేష‌న్ త‌ర్వాత ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్‌.. ఆదివారం రాత్రి హైద‌రాబాద్ న‌గ‌రానికి చేరుకున్నారు.
Tags:    

Similar News