ఇస్తామన్న వెంటనే.. ఇలాంటి మాటలా కేసీఆర్?

Update: 2016-10-24 06:05 GMT
మన అవసరం కోసం ఎదుటివాడిని అడిగేటప్పుడు.. ఎలా అడుగుతామన్న తీరులోనే స్పందించే వైనం ఉంటుంది. అన్ని తెలిసిన కేసీఆర్ కు ఇలాంటి విషయాల్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఆయన కొన్ని సార్లు వ్యవహరించే తీరు కాస్త చిత్రంగా ఉంటుంది. అవసరం తనదైనా.. ఎదుటోడే తనను అడగాలన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయని చెబుతారు. ఈ వాదనను నిజం చేస్తూ తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఉండటం గమనార్హం.

సచివాలయం పాతదైందని.. వసతులు సరిగా లేవని.. ఓ వెయ్యి మందితో కలిపి భేటీ ఏర్పాటు చేయటానికి సరైన వసతులు లేవన్న మాటలు చెబుతూ.. కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని కేసీఆర్ కొద్ది రోజులుగా చెబుతున్న సంగతి తెలిసిందే. వాస్తు కారణంగా సచివాలయం మీద ఆసక్తి లేని ముఖ్యమంత్రి.. తన అభిరుచికి తగ్గట్లుగా సచివాలయాన్ని మార్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడున్నదాన్ని నేలమట్టం చేసి.. కొత్తది నిర్మించాలన్న ఆలోచనలో ఉన్న ముచ్చట తెలిసిందే.

అయితే.. అసలు విషయాన్ని ఓపెన్ గా చెప్పకుండా.. తనదైన శైలిలో వాటిని కవర్ చేస్తూ ఆయన కొత్త సచివాలయం మీద చేస్తున్న వ్యాఖ్యలు తెలిసిందే. కొత్త సచివాలయ నిర్మాణానికి అనువుగా ఉండేందుకు.. సచివాల‌యంలో ఏపీ సర్కారుకు కేటాయించిన భవనాలు తెలంగాణకు తిరిగి ఇచ్చేలా చూడాలని ఆ మధ్యన గవర్నర్ నరసింహన్ ను కేసీఆర్ కోరిన సంగతి తెలిసిందే. ఏపీ సచివాలయాన్ని వెలగపూడికి తరలించిన నేపథ్యంలో.. భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో.. ఏపీ సచివాలయం కోసం కేటాయించిన భవనాల్ని తెలంగాణకు సర్కారుకు అప్పగించాలన్న కేసీఆర్ ఆలోచనను.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించేందుకు ఆ మధ్యన గ‌వ‌ర్న‌ర్‌ ఏపీకి వెళ్లటం.. ఆయన సూత్రప్రాయంగా ఒప్పుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా గవర్నర్ ను కలిసిన ముఖ్యమంత్రి.. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న తీర్మానాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా.. ఏపీ సచివాలయ భవనాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి స్పందనను అడిగి తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సందర్బంగా భవనాలు ఏపీ సర్కారు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని.. కాకుంటే ప్రత్యామ్నాయంగా.. ఏపీకి ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వాలన్న బాబు ఆలోచనను ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం కోరితే ప్రత్యామ్నాయ భవనాలను ఇస్తామని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఏపీకి కేటాయించిన భవనాల్ని తమకు ఇవ్వాలన్న విషయాన్ని గవర్నర్ చేత అడిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ మాత్రం తనకు అవసరమైన ప్రత్యామ్నాయ భవనాల గురించి తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే రియాక్ట్ అవుతామని చెప్పటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఏపీకి కేటాయించిన భవనాల్ని తిరిగి తెలంగాణకు ఇస్తామన్న బాబు సానుకూల మాటే.. కేసీఆర్ చేత ఇలాంటి వ్యాఖ్యలు చేసేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వాడకుండా నిరుపయోగంగా పడి ఉన్న భవనాల్ని తమకు ఇవ్వాలని కోరుతున్న కేసీఆర్.. తాము తీసుకున్న దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని భవనాల్ని ఇచ్చే విషయంలో మాత్రం ఏపీ సర్కారే తమను అడగాలన్న మాట వింటే.. భవనాలు ఇవ్వాలని అనుకున్న వారికి సైతం ఇవ్వకూడదన్న భావన కలగటం ఖాయమన్న మాటను పలువురు ఏపీ రాజకీయ నేతలు అభిప్రాయపడటం కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News