తేల్చేశారు; ఆందోళనలు చేస్తే కొత్త జిల్లాలు నై

Update: 2016-05-24 08:00 GMT
ఒక మహా ఉద్యమకారుడికి ఉద్యమం తీరు తెన్నుల గురించి తెలీటమే కాదు.. అదెలా షురూ అవుతుంది? దాన్ని ఎలా చెక్ పెట్టాలి? లాంటి విషయాలు బాగానే అర్థమవుతాయి. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ లాంటి నేతకు ఉద్యమాల్నిఎలా కట్టడి చేయాలో తెలీకుండా ఉంటుంది. గడిచిన కొద్దిరోజులుగా.. కొత్త జిల్లాల కోసం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిరసనలు.. ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిజానికి కేసీఆర్ లాంటి మహా ఉద్యమకారుడికి ఇలాంటి నిరసనలు.. ఆందోళనలు చాలా లైట్ అనుకోవాలి.

అందుకే కాబోలు.. తాజాగా తాను నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన సందర్భంగా ఆయన ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పేశారు. తెలంగాణ వ్యాప్తంగా 24 నుంచి 25 జిల్లాల్ని ఏర్పాటు చేస్తామని.. అది కూడా ఈ కొత్తజిల్లాలు ఎప్పటి నుంచో కాకుండా దసరా నుంచే అమల్లోకి వచ్చేస్తామని తేల్చేశారు. ఒక కొత్త జిల్లాలు ఎలా ఉండాలన్న విషయంపై తనకున్న అభిప్రాయాన్ని బయటకు చెప్పని ఆయన.. ఆందోళనలు.. నిరసనలతో జిల్లాలు ఏర్పాటు కావన్న విషయాన్ని తేల్చి చెప్పటం గమనార్హం. తానే కాదు.. అధికారులు కూడా ఆందోళనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేసిన ఆయన..జిల్లాల ఏర్పాటు మీద పత్రికల్లో వస్తున్నకథనాల్ని పరిగణలోకి తీసుకోవద్దని తేల్చేశారు.

తాజాగా కేసీఆర్ మాటలు ఒక విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయని చెప్పాలి. ఆందోళనలు.. నిరసనలతో కొత్త జిల్లాలు రావని స్పష్టం చేసేశారు. కొత్త జిల్లాలు శాస్త్రీయంగా ఏర్పాటు చేస్తామంటూనే.. తాను అనుకున్నదే ఫైనల్ అన్న విషయాన్ని కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి. తాజాగా తన మాటలతో ఆందోళనలు.. నిరసనలు.. ఒత్తిళ్లతో కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదన్న విషయం చెప్పేయటం ద్వారా.. ఆందోళనలు.. పోరాటాల మీద ఆశలు పెట్టుకున్న వారి కలలు కల్లలేనన్న విషయాన్ని తేల్చేశారని చెప్పాలి. కొత్త జిల్లాల మీద చాలానే సలహాలు..సూచనలు వస్తున్నాయని చెప్పిన కేసీఆర్.. వాటన్నింటి మీదా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పటం ద్వారా.. కొత్త జిల్లాల ఏర్పాటు ఎలా ఉంటుందన్న అంశంపై స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చేసినట్లుగా చెప్పొచ్చు.

నిజంగా కేసీఆర్ చెప్పినట్లుగా కొత్త జిల్లాల మీద ఇప్పటికిప్పుడు అధ్యయనం మొదలెడితే.. అదంతా పూర్తి అయి నిర్ణయం తీసుకొని.. దసరా నాటి నుంచి అమలు చేయటం సాధ్యమా? అంటే కాదనే చెప్పాలి. కానీ.. దసరా నుంచి కొత్త జిల్లాలు అందుబాటులోకి రావాలన్న మాట చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే.. కొత్త జిల్లాలకు సంబంధించిన బ్లూ ప్రింట్ ఒకటి కేసీఆర్ దగ్గర సిద్ధంగా ఉందన్న విషయం అర్థం కాక మానదు. అయితే.. కొన్ని అంశాల్ని క్రమపద్ధతిలో చేపట్టాల్సిన నేపథ్యంలో.. కొత్త జిల్లాలకు సంబంధించిన పనులు అదే తీరులో సాగుతున్నాయని చెప్పాలి. ఎవరి ఒత్తిడి మీదనో తన నిర్ణయాన్ని మార్చుకునే పక్షంలో ఆయన కేసీఆర్ ఎందుకవుతారు..?
Tags:    

Similar News