పెద్దయన సలహా : పవన్... అలా ముందుకు సాగిపో...?

Update: 2022-05-12 06:29 GMT
ఆయన పెద్దాయన. ఆయన రాజకీయం ఈ రోజుది కాదు, యాభై ఏళ్ల నాడే ప్రజా ప్రతినిధిగా నెగ్గి చట్ట సభలో అడుగుపెట్టిన వారు. ఆయనే మాజీ మంత్రి  చేగొండి హరిరామజోగయ్య.  ఎనభయ్యవ పడిలో ఉన్న హరిరామజోగయ్య కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ దాకా అన్ని పార్టీలను చూసేశారు.  ప్రస్తుతం ఆయన జనసేన అంటే ఇష్టపడుతున్నారు. ఆ పార్టీ అధికారంలోకి రావాలని మనసారా కోరుకుంటున్నారు. అదే టైమ్ లో ఆయన పవన్ కి చాలానే రాజకీయ సలహాలు ఇస్తూంటారు.

ఈసారి ఒక బహిరంగ లేఖ రూపంలో జోగయ్య పవన్ కి కీలకమైన సలహావే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ని వైసీపీ కవ్విస్తోందని ఆ లేఖలో జోగయ్య అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ కచ్చితంగా తాను అనుకున్నట్లుగానే వ్యవహరించాలని కూడా ఆయన సూచించడం విశేషం. పవన్ని ఒంటరిగా పోటీ చేయమని వైసీపీ కవ్వించడం వెనక ఫక్తు రాజకీయాలే ఉన్నాయని జోగయ్య అభిప్రాయపడుతున్నారు. విడిగా విపక్షాలు పోటీ చేస్తే మళ్లీ వైసీపీదే అధికారమని, ఆ పార్టీ మరోమారు పవర్ లోకి వస్తే ఏపీ అంధకారమే అని జోగయ్య అంటున్నారు.

అందువల్ల పవన్ తాను ఆవిర్భావ సభలో చెప్పినట్లుగా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా చూడాలని, ఆ దిశగా నడుము బిగించాలని కూడా జోగయ్య కోరారు. టీడీపీతో పాటుగా బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవాలని జోగయ్య సలహా ఇచ్చారు. ఈ మూడు పార్టీలు కనుక పొత్తు పెట్టుకుని బరిలోకి వస్తే కచ్చితంగా అధికారంలోకి వస్తాయని కూడా జోగయ్య జోస్యం చెప్పారు.

అంతే కాదు కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ సొంత నిధుల నుంచి చేస్తున్న ఆర్ధిక సాయాన్ని ఆయన ప్రశంసించారు. రానున్న రోజులలో  రైతుల సంక్షేమానికి జనసేన ఏం చేస్తుంది అని కూడా చెప్పి జనంలోకి వెళ్తే ఇంకా బాగుంటుంది అని జోగయ్య పవన్ కి సూచించారు. మొత్తానికి పెద్దాయల మద్దతు, సలహాలు జనసేనకు  ఇపుడు ఫుల్ జోష్ లో ఉంచేలా చేస్తున్నాయి.

మొత్తానికి కాపు సంక్షేమ సేన తరఫున జోగయ్య రాసిన ఈ లేఖ ఇపుడు ఏపీ రాజకీయాలలో  కలకలం రేపుతోంది. సింహం సింగిల్ గానే వస్తుంది. మిగిలవే గుంపులుగా వస్తాయని రోజుకు పది సార్లు వైసీపీ రెచ్చగొడుతోంది. పవన్ సీఎం కావాలంటే సొంతంగా పోటీ చేయాలి తప్ప ఈ పొత్తులు ఎందుకు అని కూడా కవ్విస్తోంది. ఇక కాపులు అంతా పవన్ కోసం అండగా ఉంటే ఆయన చంద్రబాబు వెనకాల పడుతున్నారు అని కూడా రీసెంట్ గా అంబటి రాంబాబు అన్నారు.

మొత్తానికి ఈ రకంగా వైసీపీ చేస్తున్న ప్రకటనలు అన్నీ మైండ్ గేమ్ లో భాగనే అని అంతా భావిస్తున్నారు. అది నిజమని సీనియర్ మోస్ట్ నేత హరి రామ జోగయ్య కూడా ఇపుడు చెబుతున్నారు. పవన్ ఈ కవ్వింపు మాటల మాయలో పడవద్దని ఆయన లేఖ రాశారు అంటే జనసేన గమ్యం ఎలా ఉండారో చెప్పేశారు అనుకోవాలి. జోగయ్య మాటలకు ఎంతో విలువ ఇచ్చే పవన్ కచ్చితంగా పొత్తులతోనే వస్తారు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News