చెడ్డీలు వేసుకునేవాళ్లకు ఓట్లేయొద్దు!

Update: 2018-01-30 15:06 GMT
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న క‌న్న‌డ ఇలాకాలో ముఖ్య‌నేత‌లు రంజుగా రాజ‌కీయాలు చేస్తున్నారు. గుజరాత్‌ లో బీజేపీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన దళిత నేత జిగ్నేష్ మేవానీ తాజాగా క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బెంగళూరులో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ 55వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తనతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో తాను చేతులు కలుపుతానని మేవానీ స్పష్టంచేశారు. కర్ణాటకలో బీజేపీ ఓటమికి తాను శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు.

కర్ణాటకలో ఏప్రిల్‌లో పర్యటిస్తానని మేవాని చెప్పారు. `రాష్ట్రంలో ఉన్న 20 శాతం దళితులను వేడుకుంటున్నాను.. మీ 20 ఓట్లు కూడా బీజేపీకి వేయొద్దు. ఏప్రిల్‌లో రెండు వారాల పాటు కర్ణాటకలో పర్యటిస్తా` అని మేవానీ అన్నారు. రాష్ట్రంలో చెడ్డీదారీస్‌ ను ఓడించడానికి కలిసివచ్చే అన్ని ప్రధాన పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధమని మేవానీ ప్రకటించారు. బీజేపీకి ఓటు వేయొద్దని ఆయన కోరారు. రాష్ట్రంలోని దళితులందరితో తాను మాట్లాడతానని చెప్పారు. `రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు నా సిద్ధాంతాల విషయంలోనూ రాజీ పడటానికి నేను సిద్ధం. కర్ణాటకలో బీజేపీని గెలవకుండా చూస్తా` అని మేవానీ అన్నారు.

దేశంలో ఉద్యోగాల కల్పన, రైతు ఆత్మహత్యల నివారణలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, కేవలం లవ్ జిహాద్‌ లాంటి అంశాలపైనే దృష్టిసారించారని మేవాని విమర్శించారు. కర్ణాటకలో ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే బీజేపీ ముఖ్య‌నేత‌లు అమిత్ షా, యోగీ ఆదిథ్యనాథ్ పర్య‌టించారు.
Tags:    

Similar News