అమ్మ ప్రమాణస్వీకారోత్సవం ఏం చెప్పిందంటే..!

Update: 2015-05-23 10:44 GMT
నిండైన ఆకుపచ్చ చీరతో.. బ్యాక్‌గ్రౌండ్‌లోను ఆకుపచ్చ ఆవరించి ఉన్న వేదిక మీద తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఐదోసారి ప్రమాణస్వీకారోత్సవం పూర్తి చేశారు. ఆమెను ముఖ్యమంత్రిగా.. సీనియర్‌ రాజకీయ నేత.. తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ హోదాలో ఉన్న కొణిజేటి రోశయ్య ప్రమాణస్వీకారం చేయించారు.

తమిళ రాజకీయాల్లో ఈ ప్రమాణస్వీకారోత్సవానికి చాలానే విశేషాలు ఉన్నాయి. కేసుల ఉచ్చులో చిక్కుకొని పదవికి రాజీనామా చేయటం.. మళ్లీ ప్రమాణస్వీకారం చేయటం జయలలితకు కొత్తేం కాదు. జైలుకు వెళ్లటం.. ఆపై అధికార సింహాసనాన్ని అధిష్ఠించటం జయలలితకు అలవాటే. రాజకీయంగా పాతాళంలోకి పడిపోయినట్లుగా అనిపించి.. అంతలోనే ఎవరూ అందుకోలేనంత స్థాయికి చేరుకోవటం ఆమెకు అలవాటే.

మరికొన్ని నెలల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో అమ్మ మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో ఆకట్టుకున్న విశేషాలు రెండు. ఒకటి.. రాజకీయంగా తనకున్న పలుకుబడిని తన ప్రమాణస్వీకారోత్సవ సమయంలో ప్రదర్శించిన జయలలిత.. రానున్న రోజుల్లో తనకు రాజకీయ ప్రత్యర్థిగా మారే అవకాశం ఉందని భావించే రజనీకాంత్‌ అమ్మ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావటం.

సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా వ్యవహరించిన నరేంద్ర మోడీ సైతం రజనీకాంత్‌తో భేటీ అయినప్పటికీ.. ఆయన్ను రాజకీయాల్లో తీసుకురాలేని పరిస్థితి. తాజాగా అమ్మ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావటం ద్వారా.. సమీప భవిష్యత్తులో తనను ఢీ కొట్టే శక్తి ఏదీ లేదన్న విషయం అమ్మ చెప్పకనే చెప్పింది.

తమిళనాడు రాజకీయాల్లో మరోకోణం కూడా ఉంది. ఒకసారి అధికారాన్ని చేపట్టిన వారిని.. తర్వాతి ఎన్నికల్లో పక్కాగా ప్రతిపక్షంలో కూర్చోబెట్టటం తమిళులకు అలవాటే. చాలా కొద్ది సందర్భాల్లో తప్పించి.. మిగిలిన సమయాల్లో రోటేషన్‌ పద్ధతిలో అధికార బదిలీ సహజ పరిణామంగా సాగుతుంటుంది. అయితే.. ఈసారి అమ్మ అలాంటిది జరగకుండా అడ్డుకునే అవకాశమే ఎక్కువన్న విషయం ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న హడావుడిని చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి.. తమిళనాడు రాజకీయాల్లో అమ్మను ఆపే శక్తి సమీప భవిష్యత్తులో లేదన్న విషయం స్పష్టమైంది. మరి.. కాలం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
Tags:    

Similar News