ఆర్డినెన్స్ వచ్చినా ఖాళీ కాని మెరీనా బీచ్

Update: 2017-01-23 06:06 GMT
జల్లికట్టుపై నెలకొన్న వివాదం సమిసిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ఇష్యూ ముగిసినట్లుగా తెలుగు మీడియా దాదాపుగా లెక్క తేల్చేసింది. తమిళులు తాము కోరుకున్నది సాధించారన్నట్లుగా హెడ్డింగులు పెట్టేశాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. జల్లికట్టుపై విధించిన నిషేదాన్ని తొలగిస్తూ.. ఆర్డినెన్స్ జారీ చేయటం.. దానిపై గవర్నర్ సంతకం పెట్టినప్పటికీ.. మెరీనా బీచ్ లో నిరసనలు చేస్తున్న వేలాది మంది వెనక్కితగ్గలేదు.

జల్లికట్టుపై విధించిన బ్యాన్ తీసే వరకూ కదిలేది లేదంటూ వేలాది మంది తమిళులు మెరీనా బీచ్ ను వేదికగా చేసుకొని శాంతియుత ఆందోళనలు చేయటం తెలిసిందే. ఇది యావత్ తమిళనాడును కదిలించటమే కాదు.. కేంద్రం సైతం జల్లికట్టు వివాదానికి పరిష్కార మార్గాన్ని వెతికి.. ఆర్డినెన్స్ రూపంలో ఆందోళనల్ని ముగింపు పలికే ప్రయత్నం చేసింది.

అయితే.. ఆర్డినెన్స్ లాంటి కంటితుడుపు చర్యలు తమకు అక్కర్లేదని.. శాశ్విత పరిష్కారం చూపించాలంటూ తమిళులు డిమాండ్ చేయటమే కాదు.. గడిచిన ఐదు రోజులుగా మెరీనా బీచ్ లో ఆందోళనలు చేస్తున్న వారు కదలని పరిస్థితి. ఇదిలా ఉంటే.. బీచ్ లో ఇప్పుడు కొత్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వేలాది మందిని ఖాళీ చేయించే దిశగా పోలీసులు రంగంలోకి దిగారు.

రిపబ్లిక్ డే వేడుకల్ని మెరీనా బీచ్ లో నిర్వహించనున్న నేపథ్యంలో.. నిరసన కారుల్ని ఖాళీ చేయించేందుకు సోమవారం ఉదయం నుంచి పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. ఇది కొత్త ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే.. తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకూ  తాము కదిలేది లేదని ఆందోళనకారులు తేల్చి చెబుతున్నారు. దీంతో.. బలవంతంగా వారిని బీచ్ నుంచి బయటకు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

తమవద్దకు వస్తున్న పోలీసులను నిలువరించేందుకు వీలుగా.. జాతీయ గీతాన్ని ఆందోళనకారులు ఆలపిస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరికొందరు.. పోలీసులు తమ వద్దకు వస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు.. ఆందోళనకారులకు మధ్య పెనుగులాట చోటు చేసుకున్నాయి. దీంతో.. పలువురు ఆందోళనకారులకు గాయాలు అయ్యాయి.

మరోవైపు.. మధురై.. కోయంబత్తూరు.. తిరుచ్చి నుంచి మెరీనా బీచ్ కు వచ్చిన ఆందోళనకారుల్ని పోలీసులు బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు. మరోవైపు.. మెరీనా బీచ్ కువచ్చే మార్గాలన్నింటిని పోలీసులు మూసి వేస్తున్నారు. మొత్తంగా నిన్న మొన్నటి వరకూ శాంతియుతంగా సాగుతున్న నిరసనలు.. తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్తంగా మారాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News