బాబు మీ హెరిటేజ్ లో కేజీ ఉల్లి 200..25కి ఇవ్వగలరా?

Update: 2019-12-09 08:35 GMT
ఆంధ్రప్రదేశ్ లో శీతాకాల సమావేశాలు వేడివేడిగా సాగుతున్నాయి.వైసీపీ - టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. పీపీఏలు - ప్రత్యేక హోదా - విభజన సమస్యలు.. ఇలా వరుసగా సభలో చర్చ సాగింది. బీఏసీ సమావేశం నిర్వహించిన తర్వాత సభ తిరిగి ప్రారంభం అయ్యాక.. ఉల్లి ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించి కీలక చర్చ జరుగుతుందని ప్రకటించారు. కానీ టీడీపీ ఉల్లి ధరలపై చర్చకు పట్టుబట్టింది.. సభను అడ్డుకునే ప్రయత్నం చేసింది.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ స్పందించారు. రాష్ట్రంలో మహిళ భద్రతకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతుంటే సభను అడ్డుకోవడం సరికాదన్నారు. తాము ఉల్లి మీద చర్చకు సిద్ధమని.. ఉల్లి ధరల నియంత్రణ విషయంలో తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయడం లేదన్నారు. దేశం మొత్తం మీద ఒక్క ఏపీలో మాత్రమే కేజీ రూ.25కు అమ్ముతున్నామని.. ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు.

ప్రతి రైతు బజారులోనూ కేజీ రూ.25 అమ్ముతున్న పరిస్థితి ఉందన్నారు జగన్. 36,536 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజారుల్లో కేజీ రూ.25 అమ్ముతున్న రాష్ట్రం మనది ఒక్కటే అని చెప్పారు.  అలాగే ప్రభుత్వం కేజీ ఉల్లి  రూ.25కు ఇస్తుంటే .. చంద్రబాబు హెరిటేజ్‌ షాపులో కేజీ రూ.200 అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. వీళ్లు ఉల్లి ధరల గురించి దిగజారి పోయి మాట్లాడుతున్నారని.. న్యాయం - ధర్మం ఉందా అంటూ మండిపడ్డారు. మహిళల భద్రతపై జరుగుతున్న చర్చను ఇలా అడ్డుకోవడం సరికాదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలేక ఉల్లి పంటను పొలాల్లోనే రైతులు వదిలేసేవారని చెప్పారు. ఇప్పుడు ఉల్లి మంచి ధరకు అమ్ముడుపోతుండటంతో రైతులకు లాభాలు వస్తున్నాయని తెలిపారు. అలాగే ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. 


Tags:    

Similar News