జగన్ ఎంపీల రాజీనామా సీరియస్సా..?

Update: 2016-10-26 15:48 GMT
ఉరుము మెరుపు లేని చందంగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్ని వేడెక్కిస్తోందని చెప్పాలి. ప్రత్యేక హోదా మీద తానెంత సీరియస్ అన్న విషయాన్ని స్పష్టం చేసిన జగన్.. హోదా సాధన కోసం ఎంతవరకైనా సరే.. అన్న చందంగా చేసిన వ్యాఖ్యలో సీరియస్ నెస్ ఎంతన్నది ఇప్పడు చర్చగా మారింది. హోదా సాధన కోసం తమ ఎంపీల చేత రాజీనామా చేయించేందుకైనా సిద్ధమేనని ప్రకటించటం ద్వారా జగన్ కొత్త అస్త్రాన్ని బయటకు తీయటం.. ఏపీ అధికారపక్షాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

హోదా మీద జగన్ చేసే వ్యాఖ్యలు.. నిర్వహించే సభలు ప్రచారం కోసమే తప్ప.. ఆయనలో అంత సీరియస్ నెస్ లేదన్న భావనను ఇప్పటివరకూ వ్యక్తం చేసిన తెలుగుతమ్ముళ్లు.. తమ చెప్పిన మాటల్ని మరోసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పక తప్పదు. కర్నూలులో ఏర్పాటు చేసిన యువభేరీలో తమ అధినేత జగన్ ప్రసంగానికి ముందే.. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ హోదా కోసం అవసరమైతే ఎంపీలంతా రాజీనామా చేస్తారన్న వ్యాఖ్య చేశారు. ఆ తర్వాత మాట్లాడిన జగన్.. బుట్టా రేణుక చెప్పిన మాటను పదే పదే ప్రస్తావించటమే కాదు.. భవిష్యత్తులో తన రాజకీయ వ్యూహం ఎలా ఉండనుందన్న విషయాన్ని చూచాయగా చెప్పేశారని చెప్పాలి. అయితే.. జగన్ చెప్పినట్లుగా ఎంపీల చేత ఎప్పుడు రాజీనామా చేయిస్తారన్నది ఒక ప్రశ్నగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎంపీల రాజీనామా చేయించాలన్న ప్రాధమిక నిర్ణయానికి అయితే జగన్ వచ్చారని.. ఎప్పుడనే విషయంలో మాత్రం పే..ద్ద కసరత్తే జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ఒక అవగాహన వచ్చినప్పటికీ.. పూర్తిస్థాయిలో మాత్రం రాలేదన్న మాట వినిపిస్తోంది. ఎంపీల రాజీనామా అస్త్రం ఎలా ఉంది? దీనికి ప్రజా స్పందన ఏమిటన్నది చెక్ చేసుకున్న తర్వాతే.. ఈ అంశంపై మరింత ముందుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. తన ఎంపీల రాజీనామాతో గేమ్ ప్లాన్ మొత్తాన్ని ఛేంజ్ చేయాలని తపిస్తున్న జగన్.. సమయం.. సందర్భం చూసుకొని ఆ అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏతావాతా తేలేదేమంటే.. తన ఎంపీల చేత రాజీనామా చేయించే విషయంలో జగన్ సీరియస్ గానే ఉన్నట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News