జగన్ ఒక రోజంతా ఆసుపత్రిలోనే ఉండాలా?

Update: 2015-10-13 04:38 GMT
ఏడు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డిని మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో బలవంతంగా ఆసుపత్రికి తరలించటం తలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించటం.. మరికాస్త ఆలస్యం చేస్తే.. మరింత ప్రమాదమని వైద్యులు హెచ్చరించటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయన్ను ఆసుపత్రికి చేర్చారు.

ఇక.. ఆసుపత్రికి తీసుకెళ్లిన జగన్ ను ఐసీయూలో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని.. ఆయన తీవ్రమైన డీహైడ్రేషన్ తో ఉన్నారని.. బీపీ 130/90 ఉందని.. పల్స్ 56 ఉందని వైద్యులు చెబుతున్నారు. షుగర్ 65 ఉంటే.. కీటోన్స్ 4+ వచ్చిందని.. ప్రస్తుతం ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నట్లు.. ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. ఐవీ ఫ్లూయిడ్స్ తో పాటు.. జ్యూసులు కూడా ఇవ్వాలన్న నిర్ణయంతో పాటు.. 24 గంటల పాటు ఆసుపత్రిలోనే ఉంచాలన్న నిర్ణయం వైద్యులంతా కలిసి తీసుకున్నట్లు గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడు ప్రకటించారు.

డీహైడ్రేషన్ తో ఉన్న జగన్ కు 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచటం మంచిదని.. అందుకే ఆయన మంగళవారం మొత్తం ఆసుపత్రిలో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైద్యుల తాజా ప్రకటనతో.. జగన్ దీక్షపై సందేహాలు వ్యక్తం చేసిన వారు డిఫెన్స్ లో పడ్డారన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News