అవగాహన లేకుండా ఓట్లు వేశాం... ఇపుడు రిజైన్ చేస్తారా...?

Update: 2021-12-15 10:30 GMT
జగన్ అంటే మాట తప్పడు, మడమ తిప్పడు. కర్ణుడికి కవచ కుండలాల మాదిరిగా జగన్ కి ఈ కితాబులు పెట్టని కిరీటాలే. జనమంతా కూడా అదే అనుకునేవారు. జగన్ సైతం అధికారంలో లేని పదేళ్లూ అలాగే ఉన్నారు. కానీ ఒక్కసారి అధికారం చేతిలో పడింది. దాని బరువు, పరువు, విలువ తెలిసిన మీదట జగన్ కూడా మెల్లగా మడమ తిప్పేయడం మొదలెట్టారు.

అది కూడా చాలా స్పీడ్ గానే. ఈ మధ్యనే చూసుకుంటే వరసబెట్టి మడమ తిప్పడాలు జోరుగా జరిగిపోతున్నాయి. మూడు రాజధానుల విషయంలో సాంకేతిక కారణాలు చూపించి తాను తెచ్చిన చట్టాలనే రద్దు చేసుకున్నారు. ఇక శాసనమండలి విషయమే తీసుకుంటే మొదట రద్దు అన్నారు, ఇపుడు ఆ రద్దు వద్దు అనుకున్నారు.

ఇపుడు లేటెస్ట్ గా సీపీఎస్ అనబడే కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టం రద్దు అని తాను ఇచ్చిన హామీకే మంగళం పాడేస్తున్నారు. నిజానికి ఇది చాలా కీలకమైన అంశం. ఉద్యోగులకు అతి ముఖ్యమైన డిమాండ్. ఈ దేశంలో సీపీఎస్ ని 2004లో నాటి యూపీయే సర్కార్ తెచ్చింది. పదవీ విరమణ చేసిన తరువాత కూడా లక్షల రూపాయలకు తగ్గకుండా సగటు ఉద్యోగి పెన్షన్ రూపంలో పొందే సీన్ ఓల్డ్ పెన్షన్ విధానంలో ఉంది. అదే 2004 తరువాత పదవీ విరమణ చేసిన వారికే తీసుకుంటే సీపీఎస్ వల్ల చాలా తక్కువ పెన్షన్ అందుకుంటారు. అది కూడా కొన్ని పరిమితులకు లోబడి.

దాంతో ఉద్యోగులు తమకు చాలా భారీ ఎత్తున ఆర్ధిక నష్టం కలుగుతోందంటూ నాటి నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆర్ధికంగా దేశం ఇబ్బందులు ఎదుర్కోవడం, ఖజానానికి ఆదాయాలు సరిగ్గా రాకపోవడం, ఇక మనిషి జీవన కాలం పెరగడం వల్ల ఉద్యోగస్తుల కంటే కూడా రిటైర్డ్ పీపుల్ ఎక్కువగా ఉండడంతో దేశంలో పెన్షనర్ల పించన్ భారం బాగా పెరిగిపోతోంది. దాంతో సీపీఎస్ అని అన్నీ ఆలోచించి నాటి ఆర్ధిక నిపుణుడు అయిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఏలుబడిలో తెచ్చారు.

అయితే ఇక్కడ ఒక మెలిక పెట్టారు. రాష్ట్రాలకు ఆర్ధిక స్థితి బాగుంటే వారు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేసుకోవచ్చు అని. అయితే ఉమ్మడి ఏపీలో బాగా ఆదాయం వచ్చినా కూడా నాటి ప్రభుత్వాలు సీపీఎస్ ని రద్దు చేయలేకపోయాయి.

ఇక అనుభవం ఎంతో ఉన్న చంద్రబాబు సైతం ఉద్యోగులకు భారీ ఎత్తున పీయార్సీ పెంచి మంచి ఫిట్ మెంట్ ఇచ్చారు కానీ సీపీఎస్ జోలికి పోలేకపోయారు. కానీ జగన్ మాత్రం సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పారు. అది కూడా అధికారంలోకి వస్తే కేవలం వారం రోజుల వ్యవధిలోనే అంటూ భారీ హమీ ఇచ్చేశారు.

ఇపుడు జగన్ కి అది ఇబ్బందిగా మారింది. నిజానికి సీపీఎస్ వచ్చి పదిహేడేళ్ళు అయింది. జగన్ రాజకీయాల్లోకి వచ్చి పుష్కర‌ కాలం గడచింది. ఇన్నాళ్ళూ కూడా ఇటువంటి కీలకమైన సమస్య మీద జగన్ స్టడీ చేయలేకపోయారా అన్న చర్చ అయితే ఉంది. ఏ మాత్రం అవగాహన లేకుండా జగన్ ఈ హామీ ఇచ్చారని అంటున్నారు ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి.

మరి జగన్ ఈ విషయంలో ఇప్పటిదాకా కనీసం తాను అధికారంలోకి వచ్చాక స్టడీ చేశాను ఫలానా వారితో చర్చించామని కూడా ఎక్కడా చెప్పలేదు, పీయార్సీ మీద ఉద్యోగులు పట్టుబడుతున్న వేళ, ఉద్యోగుల ఆందోళనలో కీలకమైన డిమాండ్ గా ఉన్న సీపీఎస్ రద్దు మీద కూడా చెప్పాల్సి వచ్చింది కాబట్టి చల్లగా ఈ మాట సజ్జల చెప్పారు.

దాంతో ఒక్కసారిగా జగన్ ఇమేజ్ డ్యామేజ్ కావడమే కాకుండా ఉద్యోగులు కూడా మండిపోతున్నారు. తమకు హామీ ఇచ్చి మోసం చేశారని వారు ఫైర్ అవుతున్నారు.

మరి అవగాహన లేకుండా హామీలు ఇచ్చినా వాటిని నమ్మి ఓట్లేసిన లక్షలాది మంది ఉద్యోగులు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువత అందరూ జగన్ కి ఓటేశారు. మరి అవగాహన లేని హామీ ఇచ్చిన జగన్ని ఇపుడు వారంతా రాజీనామా చేసి తప్పుకోండి అంటే ఆయన తప్పుకుంటారా అన్న చర్చ వస్తోంది. చంద్రబాబు లాంటి వారు కొన్ని అమలు చేయలేకపోయారు అంటే అది కనీసంగా ఆలోచించాలి కదా.

అంతే కాదు, ఒక సమస్య తన వద్దకు వచ్చినపుడు నాయకుడు అన్న వాడు అందులో సాధ్యాసాధ్యాలు స్టడీ చేయాలి కదా. అలా కాకుండా అధికారమే పరమావధిగా తోచిన హామీలు ఇచ్చేసి ఇపుడు మా వల్ల కాదు, మాకు అవగాహన లేదు అంటే జనం ఊరుకుంటారా.

జగన్ చేసిన ఈ పని వల్ల రాజకీయ నాయకుల విశ్వసనీత మీదనే కాదు, రాజకీయ నేతల అవగాహన స్థాయి మీద కూడా సందేహాలు ఏర్పడుతున్నాయి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపిల్ గా తీసుకుని ఇక మీదట ఏ నాయకుడు అయినా హామీలు ఇవ్వాలి. అంతే కాదు, ప్రజలు కూడా గుడ్డిగా నాయకుల అలవి కానీ హామీలు నమ్మి ఓట్లేయరాదు అన్నదే సీపీఎస్ ఎపిసోడ్ చెబుతోంది అంటున్నారు.

Tags:    

Similar News