బహిరంగ మూత్రవిసర్జన ఆరోపణలు.. ఎఫ్.బీఐ చీఫ్ కాష్ పటేల్ అరెస్టు?

ఈ గందరగోళం మధ్య, ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 'ది అట్లాంటిక్‘ ప్రచురించిన ఒక కథనం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.;

Update: 2026-04-26 09:30 GMT

అమెరికాలోని అత్యంత శక్తివంతమైన దర్యాప్తు సంస్థ.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీఐ) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కాశ్ పటేల్ ప్రస్తుతం తీవ్ర రాజకీయ, వ్యక్తిగత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గత కొన్ని వారాలుగా ఆయన లక్ష్యంగా జరుగుతున్న సైబర్ దాడులు, వ్యక్తిగత డేటా లీక్ వ్యవహారాలు అమెరికా రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన గతానికి సంబంధించిన అరెస్టు రికార్డులు బయటకు రావడం చర్చనీయాంశమైంది.

యువకుడిగా ఉన్నప్పుడు జరిగిన అరెస్టులు.. పటేల్ వివరణ

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం.. కాశ్ పటేల్ తన యువ దశలో రెండుసార్లు పోలీసుల అదుపులోకి వెళ్లారు. ఈ విషయాలను పటేల్ దాచకుండా స్వయంగా అంగీకరించడం గమనార్హం. అప్పట్లో ఆయన మైనర్‌గా ఉన్న సమయంలో 'అండర్‌ఏజ్ పబ్లిక్ ఇంటాక్సికేషన్' (వయసు రాకుండా బహిరంగంగా మద్యం సేవించడం) కేసులో అరెస్టయ్యారు. ఒక బార్ నుండి బయటకు వచ్చిన తర్వాత 'పబ్లిక్ యూరినేషన్' (బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం) కారణంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పాత రికార్డులపై స్పందిస్తూ "అవి నా యవ్వనంలో జరిగిన చిన్నపాటి పొరపాట్లు మాత్రమే. దశాబ్దాల క్రితం జరిగిన ఆ సంఘటనలు నా ప్రస్తుత సమర్థతను గానీ.. నా వృత్తిపరమైన నిజాయితీని గానీ ప్రతిబింబించవు" అని ఆయన స్పష్టం చేశారు.

డేటా లీక్.. ఫిషింగ్ దాడుల కలకలం

ప్రస్తుత వివాదం కేవలం పాత రికార్డులకే పరిమితం కాలేదు. ఇటీవల కాశ్ పటేల్‌కు సంబంధించిన అత్యంత వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఆయన వ్యక్తిగత గూగుల్ డ్రైవ్ హ్యాకింగ్‌కు గురైనట్లు సమాచారం. ఇది ఒక ప్రణాళికాబద్ధమైన 'టార్గెటెడ్ ఫిషింగ్' దాడి అని పటేల్ బృందం అనుమానిస్తోంది. అత్యున్నత స్థాయి భద్రతా పదవిలో ఉన్న వ్యక్తిపైనే ఇలాంటి సైబర్ దాడి జరగడం అమెరికా గూఢచారి వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

'ది అట్లాంటిక్' కథనం.. పరువు నష్టం దావాకు సిద్ధం

ఈ గందరగోళం మధ్య, ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 'ది అట్లాంటిక్‘ ప్రచురించిన ఒక కథనం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. గుర్తు తెలియని వ్యక్తుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా.. పటేల్ ప్రవర్తన.. పనితీరుపై ఆ మ్యాగజైన్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తన ప్రతిష్టను దిగజార్చేందుకే కావాలని తప్పుడు కథనాలు వండుతున్నారని పటేల్ మండిపడ్డారు.

"నాపై జరుగుతున్న ఈ వ్యవస్థీకృత ప్రచారాన్ని నేను ఉపేక్షించను. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన 'ది అట్లాంటిక్' పత్రికపై పరువు నష్టం కేసు వేయాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన ప్రకటించారు.

భవిష్యత్తు పరిణామాలు

వ్యక్తిగత గోప్యత, గత జీవితం, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారి ప్రవర్తనపై ఇప్పుడు అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు సైబర్ దాడులు, మరోవైపు రాజకీయ ప్రత్యర్థుల విమర్శల మధ్య కాశ్ పటేల్ చిక్కుకున్నారు. అయితే ఆయన చట్టపరంగా పోరాడాలని నిర్ణయించుకోవడం ఈ వివాదాన్ని మరింత కాలం సజీవంగా ఉంచేలా కనిపిస్తోంది. పటేల్ వేయబోయే పరువు నష్టం దావా మీడియా స్వేచ్ఛకు, వ్యక్తిగత ప్రతిష్టకు మధ్య జరిగే న్యాయ పోరాటంగా మారనుంది.

Tags:    

Similar News