ఆర్కే బీచ్ నిరసనకు ‘జగన్’ ఆశీస్సులు

Update: 2017-01-23 06:37 GMT
విప్లవం దావాగ్ని లాంటిది. చైతన్యమనే ఈదురు గాలి కానీ జత కలిస్తే ఎంతటి బలమైన వ్యవస్థలైనా సరే ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఇప్పుడా విషయాన్ని మెరీనా బీచ్ నిజం చేసింది. మోడీ లాంటి మొండోడ్ని సైతం మెరీనాబీచ్ దగ్గర తమిళులు జరిపిన పోరాటం కరిగించేలా చేయటమే కాదు.. ఉరుకులు పరుగులు పెట్టించి.. ఒక పరిష్కార మార్గం వెతికే వరకూ విశ్రమించలేదు.

జల్లికట్టుపై తమిళులు షురూ చేసిన మెరీనా బీచ్ ఆందోళన ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉద్యమకారులకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. నాయకుడు ఎవరూ లేకున్నా.. సోషల్ మీడియాను దన్నుగా చేసుకుంటే.. ఫలితం ఎలా ఉంటుందన్న విషయం మెరీనాబీచ్ ఉదంతం చెప్పకనే చెప్పేసింది. మెరీనా స్ఫూర్తిగా తాజాగా ఆంధ్రులు హోదా కోసం నడుం బిగించే దిశగా అడుగులు పడుతున్నాయి.

మెరీనాను స్ఫూర్తిగా తీసుకొని ఈ నెల 26న (గురువారం) విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం మౌన ప్రదర్శనకు యువత సిద్ధమవుతోంది. దీనికి పవన్ కల్యాణ్ ఇప్పటికే తన మద్దతును ప్రకటించేయటం తెలిసిందే. తాజాగా.. ఏపీ విపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఆర్కే బీచ్ ఆందోళనలకు ఓకే చెప్పేసింది.

జనవరి 26న వేలాది మందితో విశాఖలోని ఆర్కే బీచ్ ఒడ్డున కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించేందుకు పిలుపునిచ్చింది. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వరంటూ నిలదీయటమే కాదు.. తమిళుల తరహాలో శాంతియుత వాతావరణంలో ఆందోళనలు చేపట్టాలన్ననిర్ణయం ఇప్పుడు అన్ని వర్గాల్ని ఆకర్షిస్తోంది. ఆర్కేబీచ్ సాక్షిగా సాగనున్న హోదా నిరసనలు కేంద్రాన్ని ఎంతగా కదిలిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News