ఆంధ్రా అవసరాలకు తెలంగాణ విద్యుత్తు?

Update: 2015-10-08 03:56 GMT
మాటలు కోటలు దాటతాయి చేతలు గడప దాటవని పాత నానుడి. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యవహారం అలాగే ఉంది. విద్యుత్తులో 2018 నాటికి మిగులు రాష్ట్రంగా అవతరించి కావాలంటే ఆంధ్రకూ సరఫరా చేస్తామని మంత్రి గప్పాలు కొట్టారు. వాస్తవానికి తెలంగాణలో ఈడ్చి కొడితే వ్యవసాయానికి ఆరు గంటలకు మించి విద్యుత్ అందటం లేదు. నిరంతర విద్యుత్తుకు మారుపేరుగా ప్రభుత్వం షో ఇస్తున్న హైదరాబాద్‌ లో కరెంటు పోతే గంటల కొద్దీ రాదు. పైగా ప్రాంతాన్ని బట్టి విద్యుత్ సరఫరా. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ వంటి సంపన్న వర్గాలుండే ప్రాంతంలో నిరంతర విద్యుత్. ఆ పక్కనే ఉండే చింతలబస్తీ వంటి ప్రాంతాల్లో మాటిమాటికి కరెంటు పోకడ.

ఇక హైదరాబాద్ పాత బస్తీ ప్రాతంలో విద్యుత్ కోత విపరీతంగా ఉంటోందని ఎంఐఎం సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపున రైతులేమో కరెంటు లేక - నీళ్లు లేక - కల్తీ విత్తనాలతో పంటలు లేక నిలువునా దహించుకుపోతున్నారు. రైతుల మరణ మృదంగంతో విలవిలలాడుతున్న రాష్ట్రంలో ఏదో ఒకటి చేసి సంక్షోభాన్ని అదుపు చేయడానికి, బతుకుపట్ల విశ్వాసం కలిగించడానికి బదులుగా మంత్రి స్థాయి నేతలే ఇలా కాపాలంటే ఆంధ్రకూ ఇస్తాం అంటూ పనికిమాలిన బోలు మాటలు మాట్లాడుతుంటే, ప్రజలకు ఇక దిక్కెవ్వరు?
Read more!

ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎగబాకుతా .. అన్నట్లుగా ఉన్నదీ ఈ మంత్రిగారి డైలాగు. తన సొంత రాష్ట్రంలోని రైతులకు కావాల్సినంత ఇవ్వలేడు గానీ.. శత్రు రాష్ట్రంలాగా వారు భావించే ఆంధ్ర కు ఇస్తానంటున్నారు. ఒకటి మాత్రం నిజం. తెరాస నేతలూ, మంత్రులూ ఇలాంటి రెచ్చగొట్టుడు మాటలతో తమ పబ్బం గడుపుకునే కాలం పోయింది. ఆంధ్రాకు మీరు ఇచ్చేది గిచ్చేది వట్టిమాటలు కానీ, వాటిని కట్టిపెట్టి ఇకనైనా తెలంగాణ ప్రజలను కాస్త పట్టించుకుంటే బాగుంటుంది.
Tags:    

Similar News