జగన్ కొత్త ప్రచారం ఇదేనా...వర్కౌట్ అయ్యేనా...?

Update: 2021-12-24 02:30 GMT
రాజకీయాలు అన్న తరువాత ఏది చేసినా ప్రచారం అన్నది ముఖ్యం. జనాలకు ఒకటికి పది సార్లు చెప్పుకుంటే పని జరిగేది. పాలకులు అయినా ప్రతిపక్షం అయినా జనాలు మెచ్చేలాగే మాట్లాడాలి. వారిని ఆకట్టుకోవడానికి చూడాలి. ఆ విషయంలో చూసుకుంటే జగన్ రెండున్నరేళ్ళ సమయం ఉండగానే ఎన్నికల  ప్రచారంలోకి దిగిపోతున్నారా అన్న డౌట్ వస్తోంది.

రీసెంట్ గా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకాన్ని ప్రారంభించిన సందర్భంగా జగన్ ప్రజలను ఉద్దేశించి ఒక మాట చెప్పారు. గత ముప్పై నెలలలో తమ ప్రభుత్వం ఏకంగా లక్షా పదహారు వేల కోట్ల రూపాయలను ఏపీలోని టోటల్  లబ్దిదారుల ఖాతాలో వేసినట్లుగా ఫస్ట్ టైమ్ జగన్ చెప్పారు. పూర్తి గణాంకాలతో జగన్ ఈ సంగతి విడమరచి చెప్పారు.

ఈ మధ్యలో దళారీలు లేరు, అవినీతి లేదు, ఏ కమిటీ అన్నది అంతకంటే లేదు. అక్కడ నేను బటన్ నొక్కుతున్నా, ఇక్కడ మీ అకౌంట్లలో డబ్బు పడిపోతోంది. అవునా అంటూ ఆయన ప్రజలను అడిగారు. అంటే తమ ప్రభుత్వం సంక్షేమ పధకాల పేరిట ఎంత డబ్బు జనాలకు నేరుగా అందిస్తోందో తొట్ట తొలిగా జగన్ ఈ సభలో చెప్పి ప్రచారం మొదలెట్టారు అనుకోవాలి.

ఇపుడు జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ కూడా ఆయన ఈ ప్రచారాన్ని జోరు పెంచారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా పొద్దుటూరు సభలో మాట్లాడుతూ గత రెండున్నరేళ్ల కాలంలో పొద్దుటూరులో లబ్దిదారుల‌కు 320 కోట్ల రూపాయల నగదుని బదిలీ చేసినట్లుగా చెప్పారు. ఇక ఇదే తీరున ఇళ్ల పట్టాలు ఎన్ని ఇచ్చామో చెప్పారు. ఇతర పనులకు ఎన్ని నిధులు ఇచ్చిందీ వల్లె వేశారు.

అంటే జగన్ ఇక మీదట తాను జిల్లాలలో  టూర్లు చేస్తున్న సందర్భంలో ప్రతీ చోటా ఆయా జిల్లాలకు సంక్షేమ పధకాలుగా ఎన్ని వందల వేల కోట్లను ఇచ్చామో లెక్క చెప్పే వీలుంది అంటున్నారు. జగన్ ఏమి చేశారు, ఆయన సీఎం అయ్యాక ప్రజలకు దక్కిందేంటి అని విపక్షాలు ఒక వైపు విమర్శలు ధాటీగా చేస్తున్నాయి. దాంతో జగన్ ఇక మీదట తన వైపు నుంచి ఉన్న ఆయుధాలను ఇలా తీస్తున్నారు అనుకోవాలి.

ఎటూ సంక్షేమానికే పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నందువల్ల దాని గురించే ఇక జగన్ ప్రతీ సభలో అలా చెప్పుకుంటూ వెళ్లే వీలు అయితే ఉంది. మరి అభివృద్ధి గురించి కూడా ఎక్కడైనా  చర్చ రావచ్చు. దానికి వైసీపీ వద్ద ఉన్న జవాబు ఏంటో తెలియదు కానీ ఇది మాత్రం జనాలకు ఎవరి మటుకు వారికి  వ్యక్తిగత లబ్ది. ప్రతీ అకౌంట్ లో పడే నగదు మొత్తం. కాబట్టి ఎవరూ మాకు రాలేదు అని చెప్పలేరు, దాంతో దీని గురించే ఎక్కువగా చెప్పుకునే వీలు అయితే ఉంది మరి. అయితే ఎన్నికల వేళకు వచ్చేసరికి ఇది ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది చూడాలి. ఏది ఏమైనా సంక్షేమ మంత్రాన్నే ఈ రోజు దాకా గట్టిగా నమ్ముకున్న జగన్ దాని మీదనే ప్రచారాన్ని కూడా చేపట్టడానికి రెడీ అవడం విశేషమే.
Tags:    

Similar News