కాంగ్రెస్ కోలుకునే అవకాశమే లేదా ?

Update: 2021-09-05 06:30 GMT
వచ్చే ఏడాదిలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో  ఒక్కదానిలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేనట్లే కనబడుతోంది. అంటే ఇపుడు అధికారంలో ఉన్న పంజాబ్ కూడా చేజారిపోయే అవకాశం ఉందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో అర్ధమవుతోంది. ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో మూడ్ ఆఫ్ ది పీపుల్ పేరుతో ఏబీపీ+సీ ఓటర్ సంస్ధలు కలిసి సర్వే నిర్వహించాయి. 5 రాష్ట్రాలు ఏమిటంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా. వాటిల్లో పంజాబ్ లో కాంగ్రెస్ అదికారంలో ఉండగా, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవైపు నరేంద్రమోడి మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిపోతోందని బలమైన సంకేతాలు కనబడుతున్నాయి. యూపీలోని యోగా ఆదిత్య ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయినా కాంగ్రెస్ పుంజుకుంటున్న ఛాయలు ఎక్కడా కనబడకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంత వ్యతిరేకత ఉన్నా మళ్ళీ బీజేపీకే యూపీలో అధికారం దక్కబోతోందని సర్వేలో అర్ధమవుతోంది. బీజేపీకి 267 సీట్లు రావచ్చని అంచనా. తర్వాత స్ధానాల్లో ఎస్పీ, బీఎస్పీలుండగా అట్టడుగున కాంగ్రెస్ ఉంది.

మోడి మీద దేశంలో ఇంత వ్యతిరేకత ఉందని చెప్పుంటున్నా జనాలు కాంగ్రెస్ పార్టీని ఎందుకని ఇంకా నమ్మటం లేదు ? సోనియాగాంధీ, రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీలపై జనాలకు నమ్మకం పోయిందా ? అన్నదే అర్ధం కావటంలేదు. సోనియా అంటే అనారోగ్యంతో గడప దాటడంలేదు కాబట్టి ఆమెను పక్కనపెట్టేద్దాం. రాహుల్ ను కూడా జనాలు ఎందుకని నమ్మటం లేదు ? మోడికి ప్రత్యామ్నాయంగా ఎదగటంలో రాహుల్ ఫెయిలయ్యారని జనాలు డిసైడ్ అయిపోయారా ? ఇక ప్రియాం అయితే ఇప్పటికీ రాజకీయాలను సీరియస్ గా తీసుకున్నట్లు జనాలు నమ్మటం లేదేమో అనిపిస్తోంది.

సరే సర్వే ఫలితాలన్నీ వాస్తవాలవుతాయని నమ్మేందుకు లేదు. అయితే జనాల మూడ్ ను బట్టి పార్టీల పరిస్ధితి ఏమిటో ఎవరికి వారుగా అంచనాకు రావచ్చు. ఇదే నిజమైతే 2024లో నరేంద్రమోడిని ఢీ కొట్టేందుకు 19 ప్రతిపక్షాలతో కలిసి జాయింట్ కో ఆర్డినేషన్ కమిటి (జేసీసీ) ఏర్పాటు వల్ల ఉపయోగం ఏమిటి ? అన్నదే అర్ధం కావటంలేదు. జేసీసీలో తృణమూల్ కాంగ్రెస్, శివశేన, ఎన్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, ఝార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పెద్ద పెద్ద పార్టీలున్నాయి. వీటికి అదనంగా వామపక్షాలు ఎటూ ఉండనే ఉంటాయి.

వచ్చే ఎన్నికల్లో జేసీసీకి నేతృత్వం వహించాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ఇంత బలహీనంగా ఉంటే మోడిని ఢీ కొనటం ఎలా ? పార్టనర్ పార్టీలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎందుకు ఆమోదిస్తాయి. దేశ ప్రజలు సోనియా, రాహుల్, ప్రియాంక నాయకత్వాన్ని ఎందుకు నమ్మటం లేదు అన్న విషయాన్ని తల్లీ, పిల్లలు ముందుగా విశ్లేషించుకోవాలి. కన్ను కొట్టడాలు, హత్తుకోవటాలకు రాహుల్ ఫులుస్టాప్ పెట్టేసి మోడికి ధీటుగా ఎదిగే విషయంలో కష్టపడాలి. ఇష్టముంటే బయటకు రావటం లేకపోతే లేనట్లు కాకుండా ప్రియాంక కూడా పాలిటిక్స్ ను సీరియస్ గా తీసుకోవాలి. అప్పుడే జనాలు నమ్మతారు.
Tags:    

Similar News